న్యూఢిల్లీ: ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడి చేసిన కొన్ని గంటలకే భారత ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియన్తో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. చర్చలు, దౌత్యం ద్వారా ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. దీనిపై మోదీ సామాజిక మధ్యమాల్లో పోస్ట్ చేస్తూ తాజా ఘర్షణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో శాంతి, భద్రత, సుస్థిరతకు వెంటనే చర్చలు జరపాలని ఇరాన్‌కు సూచించారు.
ఇరాన్‌పై అమెరికా బలప్రయోగం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చూస్తుంటే ఇది వేగంగా నియంత్రణ కోల్పోయేలా కనిపిస్తున్నది. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సభ్యదేశాలకు పిలుపునిస్తున్నాను. దీనికి సైనిక పరిష్కారం లేదు.. ఉన్నదల్లా దౌత్య మార్గం ఒక్కటే.
-ఆంటోనియో గుటెరస్, ఐరాస సెక్రటరీ జనరల్
ఒక సార్వభౌమ దేశాన్ని క్షిపణి, బాంబు దాడులతో భయపెట్టాలనుకోవడం బాధ్యతారహిత నిర్ణయం. దాని వెనుక ఎలాంటి వాదన ఉన్నా అది సమర్థనీయం కాదు. ఇది అంతర్జాతీయ చట్టాన్ని, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను, ఐరాస భద్రతామండలి తీర్మానాన్ని తీవ్రంగా ఉల్లంఘిస్తుంది. అమెరికా దాడి మధ్యప్రాచ్యంలో సంఘర్షణ ప్రమాదాన్ని మరింత పెంచింది. ఉద్రిక్తతలకు ముగింపు పలికి రాజకీయ, దౌత్యపరంగా పరిస్థితులు పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయాలి.
-రష్యా
పశ్చిమాసియాలో సైనిక జోక్యం తరచూ దీర్ఘకాలిక సంఘర్షణలు, ప్రాంతీయ అస్థిరత సహా ఊహించని పరిణామాలకు దారితీస్తుందని చరిత్ర పదేపదే నిరూపించింది. 2003లో ఇరాక్‌పై అమెరికా దాడే అందుకు ఉదాహరణ. సైనిక చర్య కంటే కూర్చుని మాట్లాడుకోవడం ద్వారానే మధ్యప్రాచ్యంలో స్థిరత్వం సిద్ధిస్తుంది.
-చైనా
ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడులను ఖండిస్తున్నాం. అంతర్జాతీయ చట్టంలోని అన్ని నిబంధనలను ఈ దాడులు పూర్తిగా ఉల్లంఘించాయి. ఈ దాడులను ప్రతిఘటించే హక్కు ఇరాన్‌కు ఉంది. ఇరాన్‌పై కొనసాగుతున్న దురాక్రమణ కారణంగా తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు, హింస పెరగడం కలవరపెడుతున్నది. ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగితే దాని ప్రభావం ఇంటా, బయట తీవ్రంగా ఉంటుంది.
-పాక్
ప్రస్తుత సంక్షోభాన్ని దౌత్యపరంగా ముగించేందుకు ఇరాన్ చర్చలకు రావాలి. అస్థిరమైన ఈ ప్రాంతంలో స్థిరత్వానికే ప్రాధాన్యం ఇవ్వాలి. అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసేందుకు ఇరాన్‌కు ఎప్పటికీ అనుమతించకూడదు. ఆ ముప్పును తగ్గించేందుకే అమెరికా చర్యలు తీసుకుంది.
-బ్రిటన్
అమెరికా బాంబుదాడి ఏ దేశం కూడా భరించలేని ప్రాంతీయ సంఘర్షణకు దారితీయవచ్చు. ఈ భూభాగం, ఈ ప్రాంతంలో జరిగిన యుద్ధాలకు భారీ మూల్యం చెల్లించుకున్నట్టు లెబనాన్, దాని నాయకత్వం, పార్టీలకు గతంలో కంటే ఇప్పడు బాగా అర్థమైంది. అత్యున్నత జాతీయ ప్రయోజనాలకు కచ్చితంగా కట్టుబడి ఉండటం మనకు చాలా ముఖ్యం.
-లెబనాన్
జియోనిస్ట్ అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా ఇరాన్ జరుపుతున్న పోరాటంలో హౌతీల మద్దతు ఉంటుంది. అమెరికా దురహంకారానికి వ్యతిరేకంగా జిహాద్లో ముస్లిం దేశాలు కలిసిరావాలి.
-హౌతీ పొలిటికల్ బ్యూరో