న్యూఢిల్లీ, మార్చి 20 : అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానంపై దాడిచేసినట్లు ఇరాన్ చేసిన ప్రకటన ప్రపంచ దేశాలను ఉలికిపాటుకు గురిచేసింది. ఈ దాడిలో ఇన్ఫ్రారెడ్ గైడెడ్ గగన రక్షణ వ్యవస్థ కీలక పాత్ర పోషించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతున్నది. ఇరాన్ గగనతలంపై యుద్ధ మిషన్‌లో నిమగ్నమైన అమెరికా ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానం దెబ్బతినడంతో పశ్చిమాసియాలోని ఎయిర్ బేస్‌లో అత్యవసర ల్యాండింగ్ జరపాల్సి వచ్చినట్లు అమెరికా అధికారులు తెలిపారు. పైలట్ సజీవంగా ఉన్నారని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు. అయితే ఇరాన్ వాదనను పూర్తిగా ధృవీకరించని అమెరికా ప్రభుత్వం మాత్రం ఇరానియన్ కాల్పులు ఎఫ్-35ని తాకి ఉండవచ్చని అభిప్రాయపడింది. ప్రపంచంలోనే మొదటి దాడిగా ఇరాన్ ఈ ఘటనను అభివర్ణిస్తుండగా అత్యంత అధునాతన యుద్ధ విమానాన్ని ట్రాక్ చేసి మరీ ఎలా గురిపెట్టగలిగారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
భూమి నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఇరాన్‌కు చెందిన ఇన్ఫ్రారెడ్ గైడెడ్ వ్యవస్థలు రాడార్‌పై కాకుండా ఉష్ణోగ్రతలపైన ఆధారపడుతుండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రాడార్‌ను, ఇన్ఫ్రారెడ్ సంకేతాలకు దొరక్కుండా నిర్మించిన ఎఫ్-35 పూర్తిగా అదృశ్యం కాలేదు. ముఖ్యంగా హైస్పీడ్‌లో లేదా యుద్ధ విన్యాసాల్లో ఉన్నపుడు అది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇరాన్ యుద్ధంలో అనేక ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లుసహా కనీసం 16 యుద్ధ విమానాలను అమెరికా కోల్పోయిన నేపథ్యంలో ఎఫ్-35పై దాడి ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి కొన్ని ఘటనలకు స్నేహపూర్వక కాల్పులను కారణంగా అమెరికా చూపింది. ఏదేమైనా అత్యంత శక్తివంతమైనవిగా అమెరికా భావిస్తున్న ఎఫ్-35 యుద్ధ విమానంపై ఇరాన్ గురిపెట్టడం ఆధునిక యుద్ధరంగంలో సవాలుగానే అమెరికా స్వీకరించాల్సి ఉంటుంది.