న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: బహ్రెయిన్‌లోని హమాలాలో ఉన్న బాటెల్కో ప్రధాన కార్యాలయంపై బుధవారం ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఈ సంస్థ దేశంలోనే అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్ కంపెనీ. అమెరికా కంపెనీలపై దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించిన తర్వాత జరిగిన ఈ దాడి అమెజాన్‌నే మొదటి లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తున్నది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా వారం క్రితం బహ్రెయిన్, యూఏఈల్లోని అమెజాన్ వెబ్ సర్వీసులకు అంతరాయం కలిగింది. నెలరోజుల్లో ఈ కార్యకలాపాలపై ప్రభావం పడటం ఇది రెండోసారి. ఆ ప్రాంతలోని డ్రోన్ కార్యకలాపాలే ఈ అంతరాయానికి కారణమని అమెజాన్ ప్రతినిధి తెలిపారు. ఆ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడుల వల్ల అనేక డాటా సెంటర్లలో భవనాలకు నష్టం ఏర్పడి, విద్యుత్తు అంతరాయాలు ఏర్పడినట్లు ఆయన చెప్పారు.
యుద్ధంలోకి యూఏఈ!
అమెరికా-ఇరాన్ యుద్ధంలో చేరడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సుముఖంగా ఉందని, హొర్ముజ్ జలసంధిని బలవంతంగా తిరిగి తెరవడానికి అమెరికా, ఇతర మిత్రదేశాలకు సహాయం అందచేయడానికి సన్నద్ధమవుతున్నదని అరబ్ అధికారులను ఉటంకిస్తూ ఓ తాజా వార్తాకథనం వెలువడింది. తన భూభాగంపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతస్పందనగా యూఏఈ, ఇతర గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను కొనసాగిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ నిర్ణయంతో యూఏఈ ఈ యుద్ధంలో నేరుగా చేరిన తొలి పర్షియన్ గల్ఫ్ దేశంగా మారనున్నది. హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్‌పై చర్యలకు అనుమతించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం కోసం యూఏఈ ఒత్తిడి చేస్తున్నట్లు ఎమిరేట్స్ అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నది. అమెరికా, యూరప్, ఆసియాలోని సైనిక శక్తులు ఏకమై ఒక కూటమిని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది.