అహ్మదాబాద్, మార్చి 11: దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడంలో కాంగ్రెస్ అడుగుల్లోనే బీజేపీ నడుస్తున్నదని, ఆ పార్టీకి పట్టిన గతే కమలం పార్టీకి కూడా పడుతుందని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ హెచ్చరించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం గుజరాత్ వెళ్లిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా ఇలాగే పలువురు ప్రతిపక్ష నేతలపై దాడులు చేయించిందన్నారు. ‘బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలో నడుస్తున్నది. అలా చేసిన కాంగ్రెస్ ఈ రోజున మట్టి కరిచింది. బీజేపీకి కూడా అదే గతి పడుతుంది’ అని అఖిలేశ్ పేర్కొన్నారు.
రాజకీయ ప్రేరేపితం..
సదానంద్ను ఈడీ అరెస్టు చేయడంపై శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. ఇది రాజకీయ ప్రేరేపితమని అన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం నియంతృత్వాన్ని దాటి వెళ్తున్నది. అధికారం నేడు ఉండొచ్చు, రేపు పోవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉన్నది’ అని పేర్కొన్నారు.