న్యూఢిల్లీ, మే 6: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ యూనియన్ బ్యాంక్‌లో పుస్తకాల కొనుగోలు వ్యవహారంపై విచారణ జరుగుతున్నది. ఈ మేరకు మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆ బ్యాంక్ స్పష్టం చేసింది. దాదాపు రూ.7.25 కోట్లతో మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్ రచించిన ‘ఇండియా@100: రేపటి ఆర్థిక శక్తి సాకారపు కల’ పుస్తకాలను యూనియన్ బ్యాంక్ కొనడం పెద్ద ఎత్తున వివాదస్పదమవుతున్నది. ఏకంగా సుమారు 2 లక్షల పుస్తకాలను తీసుకోవడంతో ఓ బ్యాంక్ ఇన్ని పుస్తకాలను కొనాల్సిన అవసరం ఏమున్నదన్న ప్రశ్నలు తలెత్తుతుండగా, ప్రజాధనం వృథా చేశారన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. అలాగే సీఈఏ హోదాను పుస్తక ప్రచారానికి వాడుకున్నారని, అనుచితంగా వ్యవహరించారని సుబ్రమణియన్పైనా అంతా మండిపడుతున్నారు. మరోవైపు సుబ్రమణియన్‌ను ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదా నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో అందుకు ఈ వ్యవహారమే కారణమా? అన్న అనుమానాలూ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుండటం గమనార్హం.