చండీగఢ్, మార్చి 19 : గత ఏడాది ఫిబ్రవరి 13 నుంచి రైతులు నిరసన కొనసాగిస్తున్న ఖనౌరీ, శంభూ సరిహద్దు పాయింట్ల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక శిబిరాలను పంజాబ్ పోలీసులు బుధవారం బలవంతంగా తొలగించారు. రైతులను అక్కడ నుంచి తరిమివేసిన పోలీసులు తాత్కాలిక గుడారాలను కూల్చివేశారు. శంభూ, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్దకు వెళుతున్న రైతు నాయకులు జగ్జీత్ సింగ్ దల్లేవాల్, సర్వన్ సింగ్ పంధేర్తోసహా 200 మంది రైతులను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొహాలీ వద్ద దల్లేవాల్, పంధేర్ను అదుపులోకి తీసుకోగా ఖనౌరీ సరిహద్దు వద్ద మరో 200 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రెండు సరిహద్దు పాయింట్ల వద్ద భారీ సంఖ్యలో భద్రతా దళాలను మోహరించారు. అంబులెన్సులు, బస్సులు, అగ్నిమాపక శకటాలను అక్కడ నిలిపారు. ఖనౌరీ సరిహద్దు వద్ద దాదాపు 3000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. శంభూ సరిహద్దు వద్దకు మరో పోలీసు బలగాన్ని పంపించారు. రైతులు తమ టెంట్లను ఖాళీ చేసేందుకు పోలీసులు వారికి 10 నిమిషాల వ్యవధి ఇచ్చారు. బస్సులలో అక్కడి నుంచి తరలిస్తామని వారు హెచ్చరించారు. ఖనౌరీ సరిహద్దుతోపాటు పంజాబ్లోని సంగ్రూర్, పాటియాలా జిల్లాలలోని పరిసర ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అంతకుముందు కేంద్రంతో రైతులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.