న్యూఢిల్లీ, జూన్ 17: దేశానికి సేవ చేద్దామని ఆశగా ఎదురుచూసి భంగపడిన యువత అగ్గిలా రగులుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పొట్ట కొట్టిందన్న ఆక్రోశ జ్వాలల్లో దేశం తగలబడుతున్నది. బెంగాల్ నుంచి రాజస్థాన్ వరకు, పంజాబ్ నుంచి కర్ణాటక దాకా ఒక్కటే నినాదం అగ్నిపథ్‌ను రద్దు చేయాలి. త్రివిధ దళాల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా బుధవారం మొదలైన ఆందోళనలు శుక్రవారం దేశవ్యాప్తంగా అదుపు తప్పాయి. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్, తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, ఒడిశా,హిమాచల్ తదితర 12 రాష్ర్టాల్లో దాదాపు 70 చోట్ల నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఆందోళనకారులు రైల్వేస్టేషన్లను ముట్టడించి 12 రైళ్లను తగులబెట్టారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో శుక్రవారం ఓ నిరసనకారుడు మరణించాడు. బీహార్‌లో డిఫ్యూటీ సీఎం ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు. ముందు జాగ్రత్త చర్యగా రైల్వేశాఖ 235 రైళ్లను రద్దుచేసింది. అసలే ఆగ్రహంగా ఉన్న యువతను చల్లబర్చేదిపోయి, వారిని మరింత రెచ్చగొట్టేలా కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, మరో మంత్రి.. మాజీ సైన్యాధిపతి వీకే సింగ్ తదితరులు అగ్నిపథ్ పథకాన్ని అమలుచేసి తీరుతామన్నట్టుగా మాట్లాడారు. ఈ నెల 24 నుంచే అగ్నిపథ్ ప్రవేశాలు ప్రారంభిస్తున్నట్టు వైమానిక దళాధిపతి వీఆర్ చౌదరి ప్రకటించారు. అగ్నిపథ్‌ను రద్దుచేయాలన్న డిమాండ్‌తో ఆందోళనకారులు శనివారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు.
ఆర్మీ అభ్యర్థుల నిరసనలతో బీజేపీ పాలిత యూపీలోని వారణాసి దద్దరిల్లింది. కేంద్రం ఏకపక్షంగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్‌ను వెంటనే రద్దు చేయాలంటూ వేలాదిమంది నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనకారుల దాడుల్లో డజనుకు పైగా బస్సులు ధ్వంసమయ్యాయి.