(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి)
ఉత్తరప్రదేశ్ బీజేపీలో అంతర్గత సమస్యలు ఆ రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారాయి. రెండో సారి విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు సేవ చేయాల్సింది పోయి సంక్షేమాన్ని గాలికి వదిలేయటంతో అక్కడి పరిస్థితులు రోజురోజుకు అధ్వాన్నంగా మారుతున్నాయి. ఢిల్లీలో కాలు మోపాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆలోచనలు చేస్తుండటం కేంద్ర నాయకత్వానికి తలనొప్పి తెస్తున్నది. నార్త్, సౌత్ బ్లాకుల్లోని నాలుగు ప్రధాన పదవుల్లో ఏదో ఒకటి తనకు కావాలని యోగి పట్టుబట్టుతున్నట్టు తెలుస్తున్నది. కీలకమైన ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖలు ఆ రెండు బ్లాకుల్లో ఉంటాయి.
‘పెద్ద రాష్ర్టానికి నాయకత్వం వహించాను. రెండోసారి అధికారంలోకి తెచ్చాను కాబట్టి తనకు వాటిల్లో ఏదో ఒకటి కావాలి’ అని యోగి అడుగుతున్నట్టు పార్టీలో చెప్పుకొంటున్నారు. దీంతో అమిత్షా, నితిన్ గడ్కరీ అసహనానికి గురవుతున్నారని అంటున్నారు. యూపీలో బీజేపీ పరిస్థితి దిగజారిపోతున్నదని, ప్రజలకు-ప్రభుత్వానికి సయోధ్య లేకుండా పోయిందని పార్టీలోని ఒక పెద్ద వర్గం అసంతృప్తితో ఉన్నది. పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారౌతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికైతే యోగి సర్కారు ఇమేజీని మెరుగుపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ‘బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్’ పెడుతున్నారు. యూపీ సర్కారులోని విధాన నిర్ణేతలు, అధికారులు, నిపుణులు వాటికి హాజరవుతున్నారు. పరిశ్రమలు, మీడియా, సాంస్కృతిక తదితర రంగాల పెద్దలను ఆ సమావేశాలకు ఆహ్వానించి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించే పని పెట్టుకొన్నారు.