బుధవారం 27 జనవరి 2021
National - Dec 18, 2020 , 18:36:42

ఢిల్లీలో దాడులకు కేజ్రీవాల్‌ కుట్ర: బీజేపీ ఆరోపణ

ఢిల్లీలో దాడులకు కేజ్రీవాల్‌ కుట్ర: బీజేపీ ఆరోపణ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ రెచ్చగొడుతున్నారని బీజేపీ ఆరోపించింది. అందుకోసమే ఢిల్లీ అసెంబ్లీ సమావేశంలో మూడు కేంద్ర వ్యవసాయ చట్టాల ప్రతులను ఆయన చించిపారేశారని పేర్కొంటూ బీజేపీ ఐటీ సెల్‌ (సోషల్‌ మీడియా) చీఫ్‌ అభిషేక్‌ దూబే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో రైతుల ఆందోళనను ఉధృతం చేయడంతోపాటు దేశ రాజధానిలో దాడులకు కేజ్రీవాల్‌ కుట్ర పన్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఢిల్లీ నగరంలో దారుణ పరిస్థితులు నెలకొంటే దానికి బాధ్యత సీఎం కేజ్రీవాల్‌దేనని అభిషేక్‌ దూబే వ్యాఖ్యానించారు. పోలీసులు జోక్యం చేసుకుని కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరారు. గురువారం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ సమావేశంలో సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. కేంద్ర వ్యవసాయ చట్టాల ప్రతులను చించేయడం బాధాకరంగా ఉందని, తాను ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయడం లేదన్నారు. కానీ దేశ రైతులను మోసగించలేనని స్పష్టం చేశారు. 2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్న ఢిల్లీలో వీధుల్లో రైతులు ఆందోళన చేస్తున్నారని కేజ్రీవాల్‌ గుర్తు చేశారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo