Mayawati : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్వాది పార్టీ అధ్యక్షురాలు (BSP chief) మాయవతి (Mayawati).. ఆ రాష్ట్రానికి చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ (Raghavendra Pratap Singh) పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘10 మంది ముస్లిం అమ్మాయిలను తీసుకొచ్చి ఒక ఉద్యోగం పొందండి’ అన్న ఆయన విద్వేషపూరిత వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుపట్టారు.
రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్లో, ఇతర రాష్ట్రాల్లో మతకల్లోలాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని మాయావతి విమర్శించారు. లవ్ జిహాద్ పేరుతో జరుగుతున్న మత మార్పిడిలను అడ్డుకుంటున్నామనే పేరుతో ఇలాంటి క్రిమినల్స్ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. ఇలాంటి సంకుచిత వ్యాఖ్యలు చేసే వారిని ప్రభుత్వం కాపాడటానికి బదులుగా, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ ఇటీవల సిద్ధార్థ నగర్లో ఓ బహిరంగసభలో మాట్లాడుతూ.. ‘ఒక్కొక్కరు కనీసం 10 మంది ముస్లిం అమ్మాయిలను తీసుకురండి. వారితో మీకు పెళ్లి చేస్తా. ఎవరైతే ఈ పని చేస్తారో వారికి ఉద్యోగం కూడా ఇప్పిస్తా’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మాయావతి ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.