న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్‌ల (Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న దాయాదికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ దేశాన్ని అన్నివైపుల నుంచి దిగ్బంధించేలా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా సింధూ నది జలాలను ఆపేసిన ఇండియా.. మన దేశం మీదుగా పాక్ విమానాలు వెళ్లేందుకు వీళ్లేదని తేల్చిచెప్పింది. ఆ దేశ ప్రభుత్వం, ఆర్మీకి చెందిన సామాజిక మాధ్యమాలపై ఇప్పటికే నిషేధం విధించింది. అదేవిధంగా మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా సున్నితమైన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 16 పాక్ యూట్యూబ్ చానళ్లను బ్యాన్ చేసింది. పలువురి ట్విట్టర్ అకౌంట్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. భారత్ నుంచి పాకిస్థాన్‌కు ఎగుమతి అవుతున్న ఔషధాలు, ఫార్మా ఉత్పత్తులకు కూడా కోతపెట్టనుంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్ వస్తువుల ఎగుమతిపై కూడా ఆంక్షలు విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది.
మరోవైపు పాకిస్థానీ నటులైన మహీరా ఖాన్, హనియా ఆమిర్, అలీ జఫర్, ననమ్ సయీద్ సహా అనేక మంది ఇన్స్టాగ్రామ్ ఖాతాలను (Insta Accounts) బ్లాక్ చేసింది. అలీ జాఫర్, సనమ్ సయీద్, బిలాల్ అబ్బాస్, ఇక్రా అజీజ్, ఇమ్రాన్ అబ్బాస్, సాజల్ అలీ వంటి పాకిస్థానీ సెలబ్రెటీల ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు భారత్‌లో కనిపించకుండాపోయాయి. ‘అకౌంట్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా’ అని ఆయా అకౌంట్లలో దర్శనమిస్తున్నాయి. అయితే ఫవద్ ఖాన్, వాహజ్ అలీ వంటి పలువురు ప్రముఖ పాక్ నటుల ఇన్‌స్టా అకౌంట్లు ఇప్పటికీ భారత్‌లో యాక్టివ్గానే ఉండటం గమనార్హం. కాగా, భారత్ నిషేధించిన యూట్యూబ్ చానళ్లలో డాన్, సమా టీవీ, ఆరే న్యూస్, బోల్ న్యూస్, రఫ్తార్, జియో న్యూస్, సునో న్యూస్, ది పాకిస్థాన్ రిఫరెన్స్, సమా స్పోర్ట్స్, ఉజైర్ క్రికెట్, రాజీ నామా ఉన్నాయి. అలాగే ఇర్షాద్ భట్టి, అస్మా షిరాజీ, ఉమర్ చీమా, మునీబ్ ఫరూక్ అనే నలుగురు జర్నలిస్ట్‌ల పేర్లను ఈ జాబితాలో చేర్చింది.