న్యూఢిల్లీ: ఒక వ్యక్తి టాయ్ గన్‌తో జ్యువెలరీ షాపులోకి ప్రవేశించాడు. అక్కడి వారిని బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తి బీఎస్ఎఫ్ జవాన్ అని తెలుసుకుని షాక్ అయ్యారు. (BSF Jawan Robs Jewellery Shop) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. జూన్ 19న ఫర్ష్ బజార్‌లోని నగల దుకాణంలోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. పిస్టల్ మాదిరి వస్తువును చూపించి సిబ్బందిని బెదిరించాడు. నాలుగు గోల్డ్ బ్రాస్లెట్స్ దోచుకుని పారిపోయాడు.
కాగా, ఈ చోరీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పంజాబ్‌లోని ఫజిల్కాలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న 22 ఏళ్ల గౌరవ్ యాదవ్‌ను నిందితుడిగా గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఉన్న సొంత గ్రామంలో అతడ్ని అరెస్ట్ చేశారు. ఇంట్లో ఉన్న రెండు బంగారు బ్రాస్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరో రెండింటిని అమ్మగా వచ్చిన రూ.2 లక్షలను బ్యాంకు ఖాతాలో అతడు జమ చేసినట్లు తెలుసుకున్నారు.
మరోవైపు 2023లో బీఎస్ఎఫ్లో చేరిన గౌరవ్ యాదవ్ నాలుగు నెలల కిందటే ట్రైనింగ్ పూర్తి చేశాడని పోలీస్ అధికారి తెలిపారు. జూదానికి బానిసైన అతడు చాలా డబ్బులు నష్టపోయాడని చెప్పాడు. ఈ నేపథ్యంలో నేర సీరియల్స్ ద్వారా స్ఫూర్తిపొంది దోపిడీకి ప్లాన్ చేశాడని వెల్లడించారు.
కాగా, జూన్ 18న గౌరవ్ యాదవ్ సెలవు తీసుకుని ఢిల్లీ చేరుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. టాయ్ పిస్టల్ కొనుగోలు చేసి ఫర్ష్ బజార్‌లోని జ్యుయలరీ షాపులో నాలుగు బంగారు కంకణాలు దోపిడీ చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత రైళ్లు మారి మీరట్, లక్నోకు వెళ్లి చివరకు మధ్యప్రదేశ్‌లోని తన గ్రామానికి చేరుకున్నాడని వెల్లడించారు. నిందితుడికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదన్నారు.
Also Read:
Detonators In Plastic Bag | బస్టాండ్‌లో కలకలం.. ప్లాస్టిక్ బ్యాగ్‌లో జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్లు
Shinde Sena Leader Pulls Out Sword | పార్కింగ్ వివాదం.. కత్తులు దూసిన షిండే వర్గం శివసేన నేతలు