INS Mormugao | యుద్ధ నౌక మర్ముగోవా భారత నౌకాదళం అమ్ములపొదిలోకి చేరింది. ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీన్ని జల ప్రవేశం చేయించారు. ఇది ఒక స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్. 75 శాతం స్వదేశీంగా తయారైంది. ఇది పీ 15 బ్రావో తరగతికి చెందిన రెండో నౌక. ఐఎన్ఎస్ మర్ముగోవా మన దేశంలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకగా పేర్కొంటున్నారు. ఈ నౌకలో అన్ని రకాల ఆయుధాలు, సెన్సార్లు ఉన్నాయి. పీ 15 బీ క్లాస్ నౌకలు నాలుగు విశాఖపట్నం, మర్ముగోవా, సూరత్, ఇంఫాల్‌లో ఉన్నాయి. గత ఏడాది విశాఖలో ఒకటి జలప్రవేశం చేయగా.. ఇంఫాల్, సూరత్‌లోని నౌకలు త్వరలోనే నౌకాదళంలో చేరనున్నాయి.
ఈ యుద్ధనౌకకు ఓడ రేవు నగరం గోవా పేరు పెట్టారు. పోర్చుగీస్ పాలన నుంచి గోవా స్వాతంత్ర్యం పొంది 60 ఏండ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని గత ఏడాది డిసెంబర్ 19న మర్ముగోవా తన తొలి సముద్రయానం చేసింది. డిసెంబర్ 18న గోవా విమోచన దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభించారు. ఈ ఓడ పొడవు 163 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు, 7,400 టన్నుల బరువు కలిగి ఉన్నది.
యుద్ధనౌక మర్ముగోవాలో బ్రహ్మోస్, బరాక్-8 వంటి క్షిపణులు ఉన్నాయి. నాలుగు గ్యాస్ టర్బైన్ల సాయంతో ఇది 30 నాట్స్ కంటే ఎక్కువ వేగాన్ని సాధించగలదు. అణు, జీవ. రసాయన యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉండేలా దీనిని తయారుచేశారు. ప్రాజెక్ట్ 15 బీ కింద నిర్మించిన క్షిపణి విధ్వంసక యంత్రాల నాణ్యత అమెరికా, ఐరోపా నౌకానిర్మాణదారులతో ఈ నౌక పోటీ పడుతుండటం విశేషం.