న్యూఢిల్లీ: జరిగిన అన్యాయాన్ని సరిదిద్దామని, సహజ మైత్రిని పునరుద్ధరించామని బీజేపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సీఎం ఏక్నాథ్ షిండేతో కలిసి ఢిల్లీకి వచ్చిన ఆయన బీజేపీ కేంద్ర నేతలను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన పార్టీ గతంలో తనను సీఎంగా చేసిందని, ప్రస్తుతం పార్టీ అవసరాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ‘దీనికి పెద్ద మనసుతో సంబంధం లేదు. నేను మా నాయకుల సూచనలన్నింటినీ పాటిస్తాను. ఏక్నాథ్ షిండే మా నేత, సీఎం. నేను షిండేతో ఉన్నాను. ఆయన నేతృత్వంలో మేం చాలా బాగా పని చేస్తాం’ అని అన్నారు.
కాగా, శివసేన.. బాల్ ఠాక్రేకు చెందిన పార్టీ అని, అందుకే బాలాసాహెబ్ శివసేనతో తాము కూటమిగా ఉన్నామని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ‘అన్యాయాన్ని సరిదిద్దాం, సహజ మైత్రిని పునరుద్ధరించాం’ అని వ్యాఖ్యానించారు. ఏక్నాథ్ షిండేకు తమ మద్దతు ఉంటుందన్న ఆయన తమ కొత్త ప్రభుత్వాన్ని విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.