Narayana Murthy: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి ఒకప్పుడు విప్రోలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడట. అయితే, నాటి విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ఆయకు ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించాడట. కానీ, ఆ తర్వాత ‘నాడు మీకు ఉద్యోగం నిరాకరించి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను’ అని అజీమ్ ప్రేమ్‌జీ నారాయమూర్తితో అన్నారట. ఈ విషయాన్ని ఎన్ఆర్ నారాయణమూర్తి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీడియాకు వెల్లడించారు.
నాడు విప్రోలో అజీమ్ ప్రేమ్‌జీ ఉద్యోగం ఇవ్వకపోవడంతో 1981లో నారాయణమూర్తి సొంతంగా ఇన్ఫోసిస్ కంపెనీని స్థాపించారు. అనతికాలంలోనే ఇన్ఫోసిస్ కంపెనీని విప్రోకు ప్రధాన పోటీదారుల్లో ఒకటిగా నిలిపారు. ఆ క్రమంలో ఒక సందర్భంలో తనను కలిసిన నారాయణమూర్తితో అజీమ్ ప్రేమ్‌జీ ‘ఆ రోజు మీకు ఉద్యోగం ఇవ్వకుండా నేను చాలా పెద్ద పొరపాటు చేశాను’ అని వ్యాఖ్యానించారట.
నారాయణమూర్తి 1981లో తన ఆరుగురు స్నేహితులతో కలిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించారు. తన సతీమణి, రచయిత్రి సుధామూర్తి దగ్గర తీసుకున్న రూ.10 వేలను ఆ కంపెనీలో పెట్టుబడిగా పెట్టాడు. నారాయణమూర్తి నేరుగా ఐటీ కంపెనీని స్థాపిస్తే.. అజీమ్ ప్రేమ్‌జీ మాత్రం తనకు వారసత్వంగా వచ్చిన వెజిటెబుల్ ఆయిల్ కంపెనీని ఐటీ కంపెనీగా మార్చారు.
కాగా, నారాయణమూర్తి స్థాపించిన ఇన్ఫోసిస్ సంస్థ ప్రస్తుతం అజీమ్ ప్రేమ్‌జీ స్థాపించిన విప్రో సంస్థ కంటే మూడు రెట్లు అదనపు టర్నోవర్‌ను కలిగి ఉంది. 2024 జనవరి 12 నాటికి విప్రో విలువ రూ.2.43 లక్షల కోట్లు ఉండగా.. ఇన్ఫోసిస్ విలువ రూ.6.65 లక్షల కోట్లుగా ఉన్నది. నారాయణమూర్తి ఇన్ఫోసిస్ కంటే ముందుగా సాఫ్ట్రోనిక్స్ పేరుతో ఐటీ కంపెనీని స్థాపించారు. కానీ అది విఫలం కావడంతో ఆ తర్వాత ఇన్ఫోసిస్ పురుడుపోసుకుంది.