న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేపట్టిన సమయంలో భారత ప్రభుత్వం తమపై వత్తిడి తెచ్చినట్లు ట్విట్టర్ సంస్థ మాజీ సీఈవో జాక్ డార్సీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్(Rakesh Tikait) స్పందించారు. ఫేస్బుక్, ట్విట్టర్లలో రైతు ఉద్యమం గురించి ఎక్కువ ప్రచారం జరగలేదన్నారు. ఆశించిన స్థాయిలో సమాచార వ్యాప్తి జరగలేదన్నారు. సర్కార్ తమ స్థాయిలో రైతు ఉద్యమాన్ని అడ్డుకున్నట్లు టికాయత్ తెలిపారు. దీనిపై మాజీ సీఈవో జాక్ డార్సీ స్పష్టంగా చెప్పారని ఆయన అన్నారు. అయినా కానీ అలాంటి కంపెనీలు ఎటువంటి వత్తిళ్లకు లోనుకావన్నారు. బహుశా ప్రభుత్వం ట్విట్టర్ సంస్థను బెదిరించి ఉంటుందని, డార్సీ చెప్పింది నిజమే అయి ఉంటుందని టికాయత్ అన్నారు.
#WATCH | On former CEO of Twitter Jack Dorsey's claim on ‘pressure’ from India, farmer leader Rakesh Tikait says, "We had information that the kind of reach on Facebook and Twitter that was expected on farmers' protest, was not coming. They used to try to stop it at their level.… pic.twitter.com/JMUsoEak4S
— ANI (@ANI) June 13, 2023
అంతకుముందు భారత ప్రభుత్వం తమపై వత్తిడి తెచ్చినట్లు ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డార్సీ(Jack Dorsey) ఆరోపించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేపడుతున్న సమయంలో కొందరి అకౌంట్లను బ్లాక్ చేయాలని కోరుతూ భారత సర్కార్ తమపై వత్తిడి తెచ్చినట్లు డార్సీ పేర్కొన్నారు. యూట్యూబ్ ఛానల్ బ్రేకింగ్ పాయింట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాక్ ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశీ ప్రభుత్వాల నుంచి ఏవైనా వత్తిళ్లు వచ్చాయా అని ప్రశ్న వేయగా ఆయన ఇండియా గురించి ప్రస్తావించారు.
రైతుల నిరసన ప్రదర్శన సమయంలో తమకు ప్రభుత్వం నుంచి చాలా అభ్యర్థనలు వచ్చాయని, గవర్నమెంట్ పట్ల వ్యతిరేకంగా ఉన్న జర్నలిస్టులను నియంత్రించేందుకు ప్రయత్నించారని, లేదంటే ట్విట్టర్‌ను మూసివేస్తామని బెదిరించాని జాక్ డార్సీ తన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమ ఉద్యోగుల ఇండ్లను కూడా తనిఖీ చేశారన్నారు. ఒకవేళ తమ ఆదేశాలు పాటించకుంటే ఇండియాలో ఉన్న ఆఫీసులను మూసివేస్తామని కూడా హెచ్చరించినట్లు డార్సీ తెలిపారు. ప్రజాస్వామ్య భారత దేశంలో ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నట్లు మాజీ సీఈవో ఆరోపించారు.