Influencer Marketing | న్యూఢిల్లీ : హాస్యం పేరిట చౌకబారు వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా దెబ్బకు మొత్తం ఇన్ఫ్లుయెన్సర్ల మార్కెటింగ్ తీవ్రంగా ప్రభావితమైంది. యూట్యూబ్ సహా వివిధ సోషల్ మీడియా వేదికలపై గుర్తింపు అందుకున్న ఇన్ఫ్లుయెన్సర్ల మార్కెటింగ్ రేట్లు ఒక్కసారిగా పతనమయ్యాయని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ‘చాలా కేసుల్లో ఇన్ఫ్లుయెన్సర్ల మార్కెటింగ్ రేటు 50 శాతానికి పైగా పడిపోయింది. కొన్ని చోట్ల అసలు వారిని పరిగణలోకి తీసుకోవట్లేదు’ అని యాడ్ ఏజెన్సీ సీఈవో ఒకరు చెప్పారు. ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ శివాదిత్య బరజత్య మాట్లాడుతూ, ‘బ్రాండ్ డీల్స్‌లో 5 నుంచి 10 శాతం వరకు రేట్స్ పడిపోయాయి.
ఇండియాస్ గాట్ లెటెంట్ వివాదం తర్వాత చిన్న స్థాయి ఇన్ఫ్లుయెన్సర్లు పొందే మొత్తాలు గణనీయంగా పడిపోయాయి. అలాగే పేరొందిన బ్రాండ్స్ ఆందోళన చెందుతున్నాయి’ అని అన్నారు. ఓ కామెడీ షో(ఇండియాస్ గాట్ లెటెంట్)లో ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. అతనిపై పలు రాష్ర్టాల్లో పోలీసుస్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కేంద్రం స్వయంగా రంగంలోకి దిగి నోటీసులు ఇవ్వడంతో యూట్యూబ్ అతని అభ్యంతరకర వ్యాఖ్యల వీడియోను తొలగించింది. అయితే ఇదంతా రణ్వీర్ ఒక్కడి కెరీర్‌నే కాదు, మొత్తంగా ఇన్ఫ్లుయెన్సర్ల కెరీర్‌నే ప్రమాదంలోకి నెట్టేసిందని నివేదిక తెలిపింది.