Kupwara | దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. యాదాది దేశం పాక్ భూభాగం నుంచి భారత్లోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్న ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చివేశాయి. ఉత్తర కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో సరిహద్దుల ఆవల నుంచి చొరబాటుకు యత్నిస్తున్న ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. హతమైన ఉగ్రవాదులకు లష్కరే తోయిబాతో సంబంధం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉగ్రవాదుల గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం సంఘటనా స్థలంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కుప్వారాలోని నియంత్రణ రేఖ (LOC) దగ్గర నిర్ధిష్ట సమాచారం మేరకు ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించినట్లు ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ తెలిపింది. ఆపరేషన్ సమయంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. కుప్వారాలోని మచిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖ దగ్గర భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగిందని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
ఇందులో ఇప్పటి వరకు ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఆపరేషన్ జరుగుతోంది. ఈ విషయమై డీజీపీ దిల్బాగ్ సింగ్ మాట్లాడుతూ ఆర్మీ, పోలీసులతో ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రాంతం నుంచి చొరబాటు కోసం ఉగ్రవాదులు పదే పదే ప్రయత్నాలు చేస్తున్నారు. నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 16 లాంచింగ్ ప్యాడ్లు తయారు చేసినట్లు అంచనా. సైన్యం, పోలీసులు సరిహద్దులో పూర్తిస్థాయిలో పటిష్టమైన నిఘా వేసింది. ఇదిలా ఉండగా.. శని, ఆదివారాల్లోనూ పాక్ నుంచి భారత్లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.