(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): కండోమ్స్, లూబ్రికెంట్స్ కారణంగా భవిష్యత్తులో వంధ్యత్వం, క్యాన్సర్ సమస్యలు ఎదురయ్యే ప్రమాదమున్నదని వినియోగదారుల భద్రత వేదిక మామావేషన్ సంస్థ ఓ అధ్యయనంలో వెల్లడించింది. పర్యావరణంతో కలిసిపోనటువంటి శాశ్వత రసాయనాలుగా పేర్కొనే పీఎఫ్ఏఎస్ కెమికల్స్‌ను కండోమ్స్ తయారీలో వాడుతున్నారని తెలిపింది. ట్రోజన్ ఆల్ట్రా థిన్ కండోమ్స్, కే-వై జెల్లీ క్లాసిక్ లూబ్రికెంట్ వంటి ప్రఖ్యాత బ్రాండ్ ఉత్పత్తులు సహా పలు కంపెనీల ఉత్పత్తుల్లో పీఎఫ్ఏఎస్ కెమికల్స్‌ను ఎక్కువ మోతాదులో వాడుతున్నట్టు గుర్తించామని వివరించింది.
పర్-అండ్ పాలీఫ్లూలోఆల్కైల్ సబ్‌స్టాన్సెస్‌ను పీఎఫ్ఏఎస్ కెమికల్స్‌గా పిలుస్తారు. 15 వేలకు పైగా సింథటిక్ కెమికల్స్‌తో దీన్ని తయారు చేస్తారు. ఎన్నేండ్లయినప్పటికీ ఇవి నీరు, అగ్గి, నూనె, గ్రీజు ఇలా పర్యావరణంలోని ఏ పదార్థంతోనూ కలిసిపోవు. అందుకే వీటిని ఫరెవర్ కెమికల్స్ (శాశ్వత రసాయనాలు)గా పిలుస్తారు. కార్పెంటింగ్, పెయింట్లు, ఫైర్ ఫైటింగ్ ఫోమ్స్లో వీటిని ఎక్కువగా వాడుతారు.
పీఎఫ్ఏఎస్ కెమికల్స్ కలిసిన కండోమ్స్, లూబ్రికెంట్స్‌ను వాడితే వంధ్యత్వం, క్యాన్సర్‌తో పాటు కాలేయం దెబ్బతినడం, థైరాయిడ్ సమస్యలు, సంతాన లోపాలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవ్వొచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.