భోపాల్: అనారోగ్యం బారిన శిశువును తల్లిదండ్రులు ఒక భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అతడు ఆ శిశువును మంటపై తలకిందులుగా వేలాడదీశాడు. (Infant Hanged Upside Down Over Fire) ఈ నేపథ్యంలో ఆ శిశువు రెండు కళ్లు దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ పసిబిడ్డ చూపు కోల్పోవచ్చని డాక్టర్లు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఈ దారుణం జరిగింది. కోట్వర్ గ్రామంలో నివసించే కుటుంబానికి చెందిన ఆరు నెలల పసి బాబు అనారోగ్యానికి గురయ్యాడు.
కాగా, తమ కుమారుడికి గాలి సోకి ఉంటుందని తల్లిదండ్రులు భావించారు. మార్చి 13న భూతవైద్యుడు రఘువీర్ ధాకాడ్ వద్దకు ఆ శిశువును తీసుకెళ్లారు. ఆ పసి బాబును కొన్ని నీడలు వెంటాడుతున్నాయని అతడు చెప్పాడు. వాటిని వదిలిస్తానంటూ మంటపై తలకిందులుగా వేలాడదీశాడు. మంట వేడికి తాళలేని ఆ శిశువు గట్టిగా ఏడ్చాడు. అయితే నయమవుతుందని భావించి తల్లిదండ్రులు మిన్నకుండిపోయారు.
మరోవైపు ఈ సంఘటన తర్వాత ఆ పసిబాబు కళ్లు తెరువలేకపోయాడు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు శివపురి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కంటి డాక్టర్లు ఆ శిశువు కళ్లను పరిశీలించారు. రెండు కళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 72 గంటలు గడిస్తే గాని ఆ శిశువు కళ్ల పరిస్థితి గురించి చెప్పలేమన్నారు. ఆ పసిబాబు కంటి చూపు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.
కాగా, ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఈ సంఘటన గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో మంటపై తలకిందులుగా శిశువును వేలాడదీయడం, కళ్లు దెబ్బతినడంపై పోలీసులు సీరియస్గా స్పందించారు. భూతవైద్యుడు రఘువీర్పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.