ముంబై: తల్లి ఇంద్రాణి ముఖర్జీతో కలిసి జీవించాలని ఉందని, దీనికి అనుమతించాలంటూ కుమార్తె విధి ముఖర్జీ ముంబై ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ విన్నపాన్ని కోర్టు బుధవారం తిరస్కరించింది. మాజీ భర్త ద్వారా సంతానమైన 24 ఏళ్ల షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణీ ముఖర్జీ 2015లో అరెస్ట్ అయ్యింది. ఆమెకు ఇటీవల సుప్రీంకోర్టు పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె జైలు నుంచి విడుదలై ముంబైలోని తన ఇంట్లో ఉంటున్నది. ఈ కేసులో అరెస్టైన భర్త పీటర్ ముఖర్జీ కూడా 2020లో బెయిల్పై విడుదలయ్యాడు.
కాగా, పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీలకు పుట్టిన కుమార్తె విధి ముఖర్జీ చాలా కాలంగా లండన్లో ఉంటున్నది. ఈ నెల 10న ఆమె ముంబైకి వస్తున్నది. ఈ నేపథ్యంలో తల్లి ఇంద్రాణీతో కలిసి ఉండేందుకు అనుమతించాలని కోరుతూ ఆగస్ట్ 30న ముంబై ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేసింది. తన చిన్నప్పుడే తల్లి అరెస్ట్ కావడంతో ఆమెతో అనుబంధాన్ని కోల్పోయానని పేర్కొంది. అలాగే అనారోగ్యంతో ఉన్న తల్లి ఇంద్రాణిని వ్యక్తిగతంగా చూసుకోవడంతోపాటు మంచి వైద్యం అందించేందుకు వీలు కలుగుతుందని అందులో అభ్యర్థించింది.
మరోవైపు విధి ముఖర్జీ విన్నపంపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. షీనా బోరా హత్య కేసులో విధి కూడా సాక్షి అని కోర్టుకు తెలిపింది. ఆమెను ఇంకా ప్రశ్నించలేదని పేర్కొంది. అలాగే సాక్ష్యాధారాలను ప్రభావితం చేయకూడదన్న నిబంధనతో సుప్రీంకోర్టు ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్ ఇచ్చిన సంగతిని గుర్తు చేసింది. దీంతో విధి ముఖర్జీ తన తల్లి ఇంద్రాణీతో కలిసి జీవించేందుకు ముంబై ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఆమె అభ్యర్థనను తిరస్కరించింది.