న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్టు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ప్రభుత్వ వర్గాల ద్వారా ఈ విషయం విశ్వసనీయంగా తెలిసింది. సుబియాంతో భారత పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీతో కీలక చర్చలు జరుపుతారని సమాచారం.
ఫ్రెంచ్ ఆర్మీ మాజీ జనరల్‌గా పని చేసిన 73 ఏండ్ల సుబియాంతో 2024లో ఆ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. జూన్‌లో సుబియాంతో మోదీకి కాల్ చేశారు. ఇండోనేషియా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు సుబియాంతోకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా-ఇండోనేషియా సమగ్రాభివృద్ధికి వ్యూహాత్మక, భాగస్వామ్య ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరముందని ఇరువురు నేతలు చర్చించారు. ఈ నేపథ్యంలో సుబియాంతోను భారత ప్రభుత్వం గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్టు తెలుస్తున్నది.