Indira Gandhi | న్యూఢిల్లీ: అది మార్చి, 1971.. పాకిస్థానీ నియంత పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాటం సాగిస్తున్న బెంగాలీలపై పాకిస్థానీ సైన్యం ఆపరేషన్ సెర్చ్‌లైట్ పేరిట దారుణ మారణకాండ సాగిస్తున్న కాలం.. స్వతంత్ర బంగ్లాదేశ్ పోరాటానికి భారత ప్రభుత్వం అండగా నిలిచింది. పాకిస్థాన్‌తో సన్నిహితంగా ఉంటున్న అమెరికాకు ఇది నచ్చలేదు. పాకిస్థాన్ అంతరంగిక వ్యవహారాలలో భారత జోక్యాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ భారత ప్రధాని ఇందిరా గాంధీకి లేఖ రాశారు. దీనికి దీటుగా జవాబిచ్చిన ఇందిరాగాంధీ 1971 నవంబర్‌లో అమెరికాను సందర్శించారు. వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌తో ఇందిరాగాంధీ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా పాకిస్థాన్ వ్యవహారాల్లో భారతదేశ జోక్యాన్ని నిక్సన్ తీవ్రంగా నిరసించారు.
‘పాక్ వ్యవహారాల్లో జోక్యం మానుకోకుంటే భారత్‌కు తగిన గుణపాఠం చెబుతాం’ అంటూ నిక్సన్ నేరుగా ఇందిరా గాంధీనే హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఈ బెదిరింపులను ఏమాత్రం లెక్కచేయని ఇందిరా గాంధీ ఆయనకు అంతే దీటుగా సమాధానమిచ్చారు. ‘భారత్ అమెరికాను ఓ మిత్రుడిగా చూస్తుందే తప్ప యజమానిగా కాదు. తన భవిష్యత్తును రచించుకునే సామర్థ్యం భారత్‌కు ఉంది. పరిస్థితులను బట్టి ఎవరితతో ఎలా వ్యవహరించుకోవాలో మాకు తెలుసు’ అంటూ నిక్సన్‌కు సూటిగా, విస్పష్టంగా చెప్పి వైట్ హౌస్ నుంచి ఇందిర బయటకు వచ్చేశారు. వైట్‌హౌస్‌లో అధ్యక్షుడితో కలసి నిర్వహించాల్సిన సంయుక్త విలేకరుల సమావేశాన్ని సైతం ఇందిర బహిష్కరించారు. ఇందిరా గాంధీకి వీడ్కోలు పలికేందుకు కారు వద్దకు పరుగుత్తుకు వెళ్లిన విదేశాంగ మంత్రి హెన్నీ కిసింజర్, ‘మేడమ్ ప్రైమ్ మినిస్టర్. అధ్యక్షుడితో మాట్లాడేటప్పుడు కొంత సంయమనం పాటించాలని మీకు తెలియదా?’ అని ప్రశ్నించారు. దీనికి ఇందిరాగాంధీ బదులిస్తూ, ‘మీ అమూల్యమైన సలహాకు ధన్యవాదాలు. అభివృద్ధి చెందుతున్న దేశంగా మా వెన్నెముక నిటారుగా నిలబడి ఉంటుంది. అన్ని అరాచకాలను ఎదుర్కొనే వనరులు మాకు ఉన్నాయి. వేల మైళ్ల దూరం నుంచి ఏదో ఓ శక్తి పాలించే, తరచు నియంత్రించే రోజులు గతించాయని మేము నిరూపిస్తాం’ అని కటువుగా చెప్పారు. ఇదే విషయాన్ని కిసింజర్ తన ఆత్మకథలో రాసుకున్నారు. మరోవైపు, భారత్‌ను బెదిరించేందుకు పాక్‌కు మద్దతుగా యూఎస్ఎస్ ఎయిర్క్ట్రాఫ్ట్ క్యారియర్‌ను బంగాళాఖాతానికి అమెరికా పంపింది. అయినా ఇందిర బెదరలేదు.
కాగా, 1971 డిసెంబర్ 18న అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఇందిరా గాంధీకి ఒక లేఖ రాస్తూ, భారత్‌ను ఆసియా ఖండంలో ప్రధాన శక్తిగా అమెరికా గుర్తిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామిక ప్రభుత్వ ఉమ్మడి విలువలను తాము కూడా పంచుకుంటామని చెప్పారు. తమ రెండు గొప్ప దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినాలని తాను కోరుకోవడం లేదని పేర్కొన్నారు. ఆసియాలో సుస్థిరత కోసం తమ రెండు దేశాలు కలసి పనిచేసే రోజు వస్తుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. దక్షిణాసియాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల పట్ల తాను చింతిస్తున్నానని, త్వరలోనే సుస్థిరత నెలకొనగలదని ఆశిస్తున్నానని నిక్సన్ తెలిపారు. ఈ లేఖను బట్టి తనను ఢీకొన్న భారతదేశ ప్రధాని పట్ల అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ఎలా తలొగ్గిందీ స్పష్టమవుతున్నది.
అమెరికా మా బాస్ కాదు
‘అమెరికాను భారత్ ఓ మిత్రుడిగా చూస్తుందే తప్ప యజమానిగా కాదు. తన భవితవ్యాన్ని రాసుకోగల సామర్థ్యం భారత్‌కు ఉన్నది. పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించుకోవాలో మాకు తెలుసు’
-1971 యుద్ధ సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌తో భారత ప్రధాని ఇందిరాగాంధీ
అణు బెదిరింపులకు భారత్ భయపడదు
కత్తి మొన చూపించో, అణుబాంబుతో భయపెట్టో ఎవరైనా మన శిరస్సు వంచాలని చూస్తే.. మనల్ని అణచివేయాలని చూస్తే ఈ దేశం లొంగేది కాదు. ఒక ప్రభుత్వంగా మన కర్తవ్యం మారణాయుధాలకు ఆయుధాలతోనే
సమాధానమివ్వడం!
– లాల్ బహదూర్ శాస్త్రి, మాజీ ప్రధాని