Air Taxi | న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: 2026 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. అమెరికన్ కంపెనీ ఆర్చర్ ఏవివేయషన్ భాగస్వామ్యంతో ఈ సేవలను అందించనుంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ఢిల్లీ-గుర్‌గ్రామ్ ప్రయాణం కేవలం 7 నిమిషాల్లో పూర్తవుతుంది. టికెట్ ధర రూ.2 వేలు- రూ.3 వేలు మధ్యలో ఉంటుంది. తొలి దశలో ఎయిర్ ట్యాక్సీ సేవలను బెంగళూరు, ముంబైలకు కూడా విస్తరించాలని ఇండిగో, ఆర్చర్ ఏవియేషన్ భావిస్తున్నాయి.
ఒక్కో ట్యాక్సీలో పైలట్‌తో పాటు నలుగురు ప్రయాణికులు ప్రయాణించొచ్చు. 30-40 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే ఈ ట్యాక్సీలోని ఆరు బ్యాటరీ ప్యాక్‌లు పూర్తిగా చార్జింగ్ అవుతాయి. ఒకసారి పూర్తి చార్జింగ్‌తో 40 నిమిషాలు ప్రయాణించొచ్చు. ఎయిర్ ట్యాక్సీ సేవల ప్రారంభానికి పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నట్టు ఆర్చర్ ఏవియేషన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిఖిల్ గోయెల్ తెలిపారు.