న్యూఢిల్లీ, జూలై 1: తక్కువ ప్రాథమిక చార్జీలు కోరుకునే, తాము వినియోగించుకునే సేవలకు మాత్రమే చెల్లించడానికి ఇష్టపడే వినియోగదారుల కోసం ఇండిగో బుధవారం ‘ఇండిగో లైట్’ పేరిట కొత్త చార్జీల విధానాన్ని ప్రకటించింది. కేవలం క్యాబిన్ బ్యాగేజీ మాత్రమే ఉన్న వినియోగదారుల కోసం లైట్ ఆప్షన్ ఒక ప్రాథమిక స్థాయి చార్జీ(ఎంట్రీ లెవల్ ఫేర్) అని ఇండిగో పేర్కొంది. వినియోగదారులు తమ ప్రయాణ ఖర్చులపై మరింత వెసులుబాటు, నియంత్రణను పొందేలా చేసే లక్ష్యంతో దేశీయ, అంతర్జాతీయ నాన్-స్టాప్ మార్గాల్లోని విమాన ప్రయాణాలకు(వన్-వే, రౌండ్-ట్రిప్, మల్టీ-సిటీ ప్రయాణాలు సహా) పెద్దలు, పిల్లల కోసం లైట్ ఫేర్ అందుబాటులో ఉంటుందని ఇండిగో ప్రకటించింది. ప్రపంచ ముడి చమురు ధరలు తగ్గడంతో భారత్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధరలను లీటర్కు సుమారు రూ. 5 మేర తగ్గించిన కొద్ది సేపటికే ఇది జరిగింది.