న్యూఢిల్లీ, డిసెంబర్ 7: తన చర్యలతో ప్రజల నుంచి ఇండిగో విమానయాన సంస్థ తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్న క్రమంలో ఇండిగో ఉద్యోగి ఒకరు దాని లోపాలను ఎండగడుతూ పౌరులను, ఎయిర్‌లైన్స్ యాజమాన్యాన్ని ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు సంచలనం సృష్టించింది. సంవత్సరాల తరబడి సంస్థ అంతర్గత క్షీణత, అదుపులేని అహంకారాన్ని ఆయన తన లేఖ ద్వారా బహిర్గతం చేశారు. లేఖ రాసిన వ్యక్తి దీర్ఘకాలం పనిచేస్తున్న ఇండిగో ఉద్యోగిగా భావిస్తున్నారు. 2006లో ఎయిర్‌లైన్స్ తొలి రోజుల్లో సంస్థలో పనిచేయడం గర్వంగా భావించామని, తర్వాత సంస్థలో అహంకారం, దురాశ పెరిగిందని అన్నారు. పోటీని అణచివేయడానికి కొన్ని మార్గాల్లో సంస్థ దూకుడుగా వ్యహహరించి ఆకాశ ఎయిర్ లాంటి కొత్త విమానయాన సంస్థలను దెబ్బతీసిందన్నారు.
సిబ్బంది సంక్షేమం, కార్యాచరణ చిత్తశుద్ధిని పణంగా పెట్టి సంస్థ ఎదిగిందన్నారు. ఈ-మెయిల్‌ను కూడా సరిగ్గా రూపొందించలేని వ్యక్తులు ఉపాధ్యక్ష స్థాయికి ఎదగడం ప్రారంభించారని ఆయన ఆరోపించారు. నాయకత్వ ఆధిపత్యాన్ని సమర్థించుకోవడానికి పైలట్లు, ఇంజినీర్లు, గ్రౌండ్ స్టాఫ్‌తో సహా ఉద్యోగులను అణచివేసినట్టు నివేదికలు చెబుతున్నాయన్నారు. అసురక్షిత విధి సమయాలు, అలసట, కార్యాచరణ, ఒత్తిళ్ల గురించి ఆందోళన చేస్తున్న పైలట్లపై ప్రధాన కార్యాలయం సీనియర్ మేనేజ్మెంట్ కొన్నిసార్లు నోరేసుకుని అరిచింది. బెదిరించింది, అవమానించిందన్నారు. సంస్థలో జవాబుదారీతనం లేదు, భయం మాత్రమే ఉందని ఆరోపించారు.
నెలకు కేవలం రూ. 16,000-18,000 సంపాదిస్తున్న గ్రౌండ్ సిబ్బందితో వేగంగా విమానాల వెంట పరుగెత్తడం, బరువైన లగేజీలు మోయడం వంటివి చేయిస్తూ ముగ్గురు వ్యక్తుల పనిని ఒకరితో చేయిస్తున్నారని, పైగా వారిపై తీవ్ర ఒత్తిళ్లు, పరిమితులు విధించారని ఆరోపించారు. ప్రయాణికులను పలకరించే మధ్య క్యాబిన్ సిబ్బంది పని ఒత్తిడితో గాలిలో ఏడ్చినట్టు తెలిసిందన్నారు. ఇంజినీర్లు విమానాల్లో వివిధ పనులు చేస్తూ ఎటువంటి పర్యవేక్షణ, విశ్రాంతి లేకుండా ఉన్నారని తెలిపారు. అంతే కాకుండా విమానంలో ప్రయణించే వారిని ప్రయాణికులు అని కాకుండా కస్టమర్లు అని పిలవాలని సూచనలు ఇచ్చారన్నారు. సంస్థ అభివృద్ధికి దోహదం చేసే పౌరుల పట్ల సంస్థ నిర్లిప్తతను ఇది ప్రతిబింబిస్తుందన్నారు.