IndiGO CEO : ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. వందల సంఖ్యలో సర్వీస్‌ల రద్దుతో ప్రయాణికులు అగచాట్లు పడుతున్న వేళ.. కేంద్రప్రభుత్వం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల్లో భారీగా ప్రయాణికులు నిరీక్షిస్తున్న అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు నష్టాలు.. మరోవైపు ప్యాసింజర్స్ కష్టాలపై శుక్రవారం ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్స్ (Pieter Elbers) కీలక ప్రకటన చేశారు. ఊహించని అంతరాయానికి తమను క్షమించాలని కోరిన ఆయన.. శుక్రవారం ఒక్కరోజే వెయ్యికిపైగా విమానాలు రద్దు చేశామని వీడియో మెసేజ్ విడుదల చేశారు.
‘కొన్ని రోజులుగా విమాన సర్వీస్‌ల విషయంలో అంతరాయాలు చూస్తున్నాం. అప్పటి నుంచి ఈ పరిస్థితి మరింత జఠిలంగా మారింది. డిసెంబర్ 5, శుక్రవారం మాత్రం సర్వీస్‌లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ ఒక్కరోజే 1000కి పైగా విమానాలను రద్దు చేశాం. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందుకు నా తరఫున, మా సంస్థ ఇండిగో తరఫున మీఅందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నా. సర్వీస్‌లు ఆలస్యంగా నడవడం, పలు విమానాలు రద్దు కావడంతో చాలామంది కష్టాలు పడుతున్నారు. ఇండిగోలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి కనీసం పది రోజులు పట్టేలా ఉంది. డిసెంబర్ 10-15 వరకూ సర్వీస్‌లు యథావిధిగా నడిచే అవకాశముంది’ అని పీటర్స్ పేర్కొన్నారు.
Statement from Mr. Pieter Elbers, CEO of IndiGo on the current nationwide Indigo flights’ crisis. Several flights cancelled and delayed. pic.twitter.com/6Wu3yCnjdU
— GNW News ⚡ Genuine National Window (@gnwnews_a) December 5, 2025
విమానయాన సంస్థ ఇండిగోలో నెలకొన్న సంక్షోభం, విమానాల రద్దుతో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పలు విమానాశ్రయాల్లో వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్న వేళ సమస్య మూలాలు తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. అంతేకాదు ప్రయాణికులు, వారి ఆత్మీయుల సౌలభ్యం కోసం 24×7 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. దేహాల నివృత్తి కోసం 011-24610843, 011-24693963, 096503-91859 నంబర్లకు డయల్ చేయాలని సూచించింది. ఇండిగో సంక్షోభం ఫలితంగా.. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లే అన్ని దేశీయ విమానాలు ఇవాళ అర్ధరాత్రి వరకూ రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. సంపౌర విమానయాన సంస్థ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ విమానాల సర్వీస్‌లను క్రమబద్దీకరించడంపై గురి పెట్టింది.
As per the directions of Civil Aviation Minister Ram Mohan Naidu, the control room at the Ministry has been continuously engaging to maintain constant vigil over the unprecedented situation arising from the cancellation and delays of IndiGo flights. Civil Aviation Minister Ram… pic.twitter.com/ZYTn26EDsV
— ANI (@ANI) December 5, 2025
ఇండిగోలో నెలకొన్న సంక్షోభంతో విమాన టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచాయి. దీంతో ప్రయాణికుల విమాన ప్రయాణం మరింత భారంగా మారింది. ఇవాళ ఢిల్లీ-ముంబై, ముంబై-ఢిల్లీ మార్గంలో విమాన టికెట్ ధర ఏకంగా రూ.60 వేలుగా (రౌండ్ ట్రిప్) ఉంది. అదే వన్‌వే అయితే రూ.35,000గా చూపిస్తోంది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఇది ఒకటి. దీంతో విమాన టికెట్ ధరలను విమానయాన సంస్థలు భారీగా పెంచాయి.