Millitary exercise | మహారాష్ట్రలోని దేవ్లాలీలో ఉన్న స్కూల్ ఆఫ్ ఆర్టిలరీలో సైనిక విన్యాసాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రదర్శించిన స్వదేశీ తయారీ ఆయుధాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి ఏటా ఆర్టిలరీ మెన్ కోసం స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ శిక్షణా విన్యాసాలను నిర్వహిస్తుంది. ఈ ఏడాది విన్యాసాలకు స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ హరిమోహన్ అయ్యర్ నాయకత్వం వహించారు. ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు ఆర్టిలరీ రెజిమెంట్ సిద్ధంగా ఉన్నదని ఈ ఆయుధాల ప్రదర్శనతో చాటి చెప్పారు.
సైనిక కసరత్తులో ప్రదర్శించిన అన్ని తుపాకీ వ్యవస్థలు, ఇతర పరికరాలు భారతీయ సామర్థ్యాన్ని ప్రదర్శించాయని చెప్పవచ్చు. తుపాకులతోపాటు కే-9 వజ్ర, ధనుష్ సిస్టమ్ లేదా ఎం777 తుపాకీ వ్యవస్థలన్నీ మన దేశంలోనే అసెంబుల్ చేశారు. స్వాతి రాడార్ వ్యవస్థతోపాటు రిమోట్‌తో నడిచే వాహనాలు భారతదేశంలో తయారుచేశారు. నాలుగు నెలల క్రితమే ధనుష్ గన్ సిస్టమ్ అందివచ్చింది. తుపాకులు, మోర్టార్లు, రాకెట్లు, డ్రోన్లు, నిఘా పరికరాలు ఈ ఎడిషన్ సైనిక విన్యాసంలో ప్రదర్శించారు.
#ExTOPCHI
Firepower demonstration and training exercise of the Regiment of Artillery, was conducted by the School of Artillery , Devlali at Devlali Field Firing Ranges on 29 January . pic.twitter.com/bV0qJpcOWy— PRO Defence Pune (@PRODefPune) January 29, 2023
ఈ సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ హరిమోహన్ అయ్యర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం భారత ఆర్టిలరీ సామర్థ్యాన్ని వెల్లడి చేస్తున్నదని చెప్పారు. ఈ ఏడాది స్వావలంబనపై దృష్టి పెట్టామన్నారు. ఈ విన్యాసాల్లో వెల్లింగ్టన్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, డిఫెన్స్ సర్వీసెస్ టెక్నికల్ స్టాఫ్ కోర్స్, నేపాల్ ఆర్మీ కమాండ్, పుణె స్టాఫ్ కాలేజ్ విద్యార్థి అధికారులు, పౌర పరిపాలన అధికారులు పాల్గొన్నారు.