న్యూఢిల్లీ: దేశంలో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం 2026-27 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందే రెవెన్యూను పెంచుకునే చర్యల్లో భాగంగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుపై రూ. 3-4 చొప్పున పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు జేఎం ఫైనాన్షియల్ తన తాజా నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు నిలకడగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వం బడ్జెట్‌కు ముందే ఈ చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది.
సౌదీ అరేబియా నేతృత్వంలోని ఒపెక్ రోజుకు 20-30 లక్షల బ్యారెళ్ల ముడి చమురును సరఫరా చేస్తుండగా 2026 నవంబర్‌లో అమెరికా మధ్యంతర ఎన్నికలు పూర్తయ్యేవరకు అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్‌కు 65 డాలర్ల చొప్పున కొనసాగే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుగా ఫిబ్రవరి 1న తన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందుగానే లీటరుకు రూ. 3-4 చొప్పున పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచవచ్చని నివేదిక తెలిపింది.
దీని వల్ల ప్రభుత్వానికి రూ. 50,000 కోట్ల నుంచి రూ. 70,000 కోట్ల వరకు అదనపు వార్షికాదాయం సమకూరగలదని జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. ఇది జీడీపీలో సుమారు 0.15-0.2 శాతం వరకు ఉంటుందని తెలిపింది. ముడి చమురు ధరలు తీవ్రంగా పతనమైన కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీలు) ప్రస్తుతం సాధారణ ఇంధన మార్కెటింగ్ మార్జిన్ల కన్నా అధిక మార్జిన్లను గడిస్తున్నాయని వెల్లడించింది. బ్రెంట్ క్రూడ్ ప్రైస్ ప్రస్తుతం బ్యారెల్‌కు 61 డాలర్ల చొప్పున ఉంది. దీని వల్ల ఓఎంసీలు ఆటో ఫ్యూయల్ గ్రాస్ మార్కెటింగ్ మార్జిన్(జీఎన్ఎం) లీటరుకు దాదాపు రూ. 10.6 గడిస్తున్నాయి.