
Hindustan Syrengies | దేశంలోకెల్లా అతిపెద్ద సిరంజీలు, నీడిల్స్ తయారీ సంస్థ హిందూస్థాన్ సిరంజీస్ అండ్ మెడికల్ డివైజెస్ (హెచ్ఎండీ)ని హర్యానా ప్రభుత్వం మూసివేసింది. ఢిల్లీ రీజియన్ పరిధిలో పెరిగిపోయిన భారీ కాలుష్యాన్ని నియంత్రించడానికి హర్యానా కాలుష్య నియంత్రణ మండలి సిఫారసు మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీని మూసివేశారు. అయితే, ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో తమ సంస్థ సిరంజీలు, నీడిల్స్ చాలా అవసరం అని హెచ్ఎండీ పేర్కొన్నది.
వ్యాక్సినేషన్లో జాప్యం జరుగకుండా తమ సంస్థపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ఆ సంస్థ ఎండీ రాజీవ్నాథ్ లేఖ రాశారు. సిరంజీలు, నీడిళ్ల ఫ్యాక్టరీలను మూసేయడం వల్ల సప్లయ్ చైన్లో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. కనుక జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద తమ ఫ్యాక్టరీలను తెరిచేందుకు అనుమతించాలని కోరారు.
దేశంలోని అవసరాల్లో 60 శాతానికి పైగా సిరంజీలు, నీడిళ్లను హెచ్ఎండీ సరఫరా చేస్తున్నది. ఇక నుంచి డీజిల్ జనరేటర్లను వాడబోమని, సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా పూర్తిస్థాయిలో విద్యుత్ సమకూరుస్తామని పేర్కొన్నారు.