హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): కేవలం ఆయుధాలు మాత్రమే భారత్ శక్తి కాదని.. ఐక్యతే మన ఆయుధమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. శుక్రవారం ఏపీ రాజధాని అమరావతిలో పునః నిర్మాణ సభలో మోదీ మాట్లాడారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన ఏపీలో పోలవరం త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకూ అమరావతి గమ్యస్థానంగా మారుతుందని తెలిపారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పనలో కేంద్రం సహకరిస్తుందని చెప్పారు.
సభలో ప్రసంగించిన ఏపీ మంత్రి లోకేశ్ తెలంగాణ ఏర్పాటుపై తన అక్కసు వెల్లగక్కారు. ‘2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో కట్టుబట్టలతో మెడబట్టి మనల్ని గెంటేశారు’ అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘రాజధాని లేకుండానే రాష్ర్టాన్ని విడగొట్టారు. చంద్రబాబుకు సంక్షోభాలు కొత్త కాదు.. అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతిని రాజధానిగా ప్రకటించారు’ అని పేర్కొన్నారు.