న్యూఢిల్లీ: ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా రిలీజైంది. ఆ లిస్టులో అత్యంత సంపన్న భారతీయ మహిళగా సావిత్రి జిందాల్(Savitri Jindal) నిలిచారు. టాప్ టెన్ ఇండియన్ బిలియనీర్ల జాబితాలో ఆమె మూడవ స్థానంలో ఉన్నారు. ఓపీ జిందాల్ గ్రూపు ఓనర్‌గా ఆమె ఉన్నారు. ప్రస్తుతం ఆమె హర్యానాలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ బిలియనీర్స్ 2025 జాబితాలో రిచెస్ట్ ఇండియన్ వుమెన్‌గా నిలిచారు. ఆమె ఆస్తుల విలువ సుమారు 35.5 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆ జాబితాలో వెల్లడించారు. ముకేశ్ అంబానీ, గౌతం అదానీ తర్వాత ఆ జాబితాలో సావిత్రి మూడవ స్థానంలో ఉన్నారు. టాప్ 10 భారత బిలియనీర్లలో ఉన్న ఏకైక మహిళ ఆమే కావడం విశేషం.
స్టీల్, పవర్, సిమెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో జిందాల్ గ్రూపు వ్యాపారాలున్నాయి. ఆ గ్రూపునకు సావిత్రి చైర్మెన్‌గా కొనసాగుతున్నారు. ఆమె భర్త ఓం ప్రకాశ్ జిందాల్ ఆ కంపెనీ స్థాపించారు. 2005లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఓపీ జిందాల్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతి తర్వాత వ్యాపారాన్ని నాలుగురు కుమారులకు విభజించారు.
ముంబైలో ఉండే ఆమె కుమారుడు సజ్జన్ జిందాల్ .. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం చేస్తున్నాడు. ఎంజీ మోటారు ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలో 35 శాతం వాటా తీసుకున్నారు. ఢిల్లీలో నివసించే నవీన్ జిందాల్.. జిందాల్ స్టీల్, పవర్ చూసుకుంటున్నారు.
ఇండియాలో బిలియనీర్ల జాబితాలో కొత్తగా అయిదుగురు చేరారు. భారతీయ బిలియనీర్ల మొత్తం ఆస్తుల విలువ 941 బిలియన్ల డాలర్లు. గత ఏడాదితో పోలిస్తే ఇది తగ్గింది. స్టాక్, కరెన్సీ వడిదిడుకులతో విలువ తగ్గినట్లు భావిస్తున్నారు.