న్యూఢిల్లీ, జూలై 18 : గ్లోబల్ టెర్రరిస్ట్, భారత దేశ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ తమ దేశంలో లేడంటూ ఇన్నాళ్లూ పాకిస్థాన్ చేస్తున్న వాదన అబద్ధమని తెలిసిపోయింది. అతడు ప్రస్తుతం పాకిస్థాన్‌లోనే ఉన్నాడన్న విషయాన్ని మన నిఘా వర్గాలు గుర్తించాయి.
తన బలమైన బహావల్పూర్ స్థావరం నుంచి వెయ్యి కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉన్న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రాంతంలోని గిల్గిట్ బాలిస్థాన్లో అతని జాడ కన్పించినట్టు మన నిఘా వర్గాలు తెలిపాయి. సద్పారా రోడ్ ప్రాంతంలోని స్కర్దులో ఇటీవల అజర్ కన్పించాడు. ఈ ప్రాంతంలో రెండు మసీదులు, వాటి అనుబంధ మదర్సాలు, కొన్ని ప్రైవేట్, ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లు ఉన్నాయి.