PM Modi : భారత్ 2025లో ఎన్నో విజయాలు సాధించిందని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ‘మన్‌కీ బాత్ (Mann Ki Baat)’ 129వ ఎసిపోడ్‌లో ప్రధాని ప్రసంగించారు. ఇందులో భాగంగా 2025లో భారతదేశం సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా భారత్ ప్రపంచ దేశాలకు తన బలాన్ని చూపించిందని చెప్పారు. దేశంలోని ప్రతిపౌరుడికి ఈ ఆపరేషన్ గర్వకారణంగా మారిందన్నారు.
వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు కూడా దేశ ప్రజల్లో ఇదే స్ఫూర్తి కనిపించిందని ప్రధాని చెప్పారు. క్రీడలపరంగా కూడా ఈ ఏడాది చిరస్మరణీయమని మోదీ అన్నారు. 12 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుందని, మహిళల క్రికెట్ జట్టు మొదటిసారి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుందని తెలిపారు. మహిళల అంధుల జట్టు టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు.
అంతరిక్ష రంగంలోనూ ఈ ఏడాది భారత్ తన ప్రతిభను చాటుకుందని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లాను ఆయన ప్రశంసించారు. కోట్ల మంది పాల్గొన్న మహా కుంభమేళాను దిగ్విజయంగా నిర్వహించి భారత్ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచిందని మోదీ పేర్కొన్నారు. అయోధ్య రామాలయంలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం ప్రతి హిందువు గర్వపడేలా చేసిందని చెప్పారు.
ఈ ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలను గుర్తుచేశారు. 2025లో దేశ ప్రజలు ఏ విధంగా ఐక్యతతో సామరస్యంగా ఉన్నారో అదేవిధంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో దేశాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.