Anand Mahindra | దేశంలో తొలిసారి లిథియం నిక్షేపాలను శాస్త్రవేత్తలు గుర్తించిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో సుమారు 5.9 మిలియన్ టన్నుల లిథియం రిజర్వ్‌లు ఉన్నట్లు కేంద్ర సర్కారు గురువారం ప్రకటించింది. దేశంలో భారీగా లిథియం నిక్షేపాలు బయటపడటంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా తాజాగా స్పందించారు. ఇకపై భారత్ భవిష్యత్తు అంతా ఎలక్ట్రిఫైయింగే అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఎలాంటి సందేహం లేదు. ఇకపై భారత్ భవిష్యత్తు అంతా ఎలక్ట్రిఫైయింగే’ అంటూ ట్వీట్ చేశారు.
No doubt now, that India’s future will be ‘electrifying’ 👍🏽💪🏽 https://t.co/jCtNJRVyFF
— anand mahindra (@anandmahindra) February 10, 2023
కాగా, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో లిథియం అత్యంత కీలకమైంది. భారత్ కొన్నేళ్లుగా దేశీయంగా విద్యుత్తు వాహనాల తయారీని ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. బ్యాటరీలు, ఇతర విద్యుత్తు పరికరాల తయారీలో లిథియం ముఖ్యపాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి లోహాలను భారత్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో లిథియం నిల్వలు భారత్‌లో వెలుగు చూడటంతో.. భవిష్యత్తులో దీని దిగుమతులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, బ్యాటరీ ధరలు కూడా దిగిరానున్నాయి.
జమ్మూకశ్మీర్‌లోని రిసాయి జిల్లాలో ఉన్న సలాల్ హైమనా ప్రాంతంలో లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. లిథియం, బంగారంతో పాటు 51 ఖనిజ నిక్షేపాల సమాచారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవేసినట్లు తెలిపింది. బంగారంతో పాటు పొటాషియం, మోలిబ్డీనియం, ఇంకా ఇతర బేస్ మూలకాలకు చెందిన నిక్షేపాలను 11 రాష్ట్రాల్లో గుర్తించారు. కశ్మీర్‌తో పాటు ఏపీ, చత్తీస్ఘడ్, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ నిక్షేపాలు ఉన్నట్లు గనులశాఖ తెలిపింది.