కొల్లాం, నవంబర్ 23: సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి, తమిళనాడు మాజీ గవర్నర్ జస్టిస్ ఫాతిమా బీవీ (96) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. గురువారం కేరళలోని కొల్లాంలో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల కేరళ సీఎం పినరయి విజయన్, రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ సంతాపం వ్యక్తం చేశారు. బాల్యంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చదువు కొనసాగించారని, కోర్టు మున్సిఫ్‌గా కెరీర్‌ను ప్రారంభించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకు ఎదిగారని విజయన్ అన్నారు. తొలి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆమె చరిత్ర సృష్టించారని మంత్రి వీణా జార్జ్ అన్నారు. .
అంచెలంచెలుగా..
జస్టిస్ ఫాతిమా బీవి.. కేరళలోని పతనంతిట్టలో 1927 ఏప్రిల్ 30న జన్మించారు. న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థాయిలో పనిచేసిన మొదటి ముస్లిం మహిళగా ఆమె గుర్తింపు అందుకున్నారు. తిరువనంతపురం వర్సిటీలో బీఎస్సీ డిగ్రీ పూర్తిచేశారు. ఆ తర్వాత అక్కడి లా కాలేజ్‌లో న్యాయ విద్యను అభ్యసించారు. 1950లో అడ్వొకేట్‌గా నమోదు చేసుకున్నారు. 1958లో కేరళ సబార్డినేట్ జ్యుడీషియల్ సర్వీసెస్‌లో మున్సిఫ్‌గా ఎంపికైన ఫాతిమా బీవి.. ఆ తర్వాత సబార్డినేట్ జడ్జిగా పదోన్నతి అందుకున్నారు. 1983 నుంచి 1989 వరకు కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1989లో దేశంలోనే మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా ఎంపికై రికార్డు సృష్టించారు. 1992లో రిటైర్ అయ్యాక, 1997లో తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు.