Transgender Clinics | న్యూఢిల్లీ, మార్చి 1: అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందచేసే యూఎస్ఎయిడ్‌ని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మూడు నెలలపాటు నిలిపివేయడంతో ట్రాన్స్జెండర్ల కోసం భారత్‌లో మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన మూడు క్లినిక్కులు మూత పడ్డాయి. ఇందులో ఒకటైన హైదరాబాద్‌లోని క్లినిక్ గత నెలలో మూత పడింది. యూఎస్ ఎయిడ్ నుంచి కార్యక్రమాల నిలిపివేత ఆదేశం కారణంగా దాదాపు 5 వేల మందికి సేవలకు అవరోధం ఏర్పడింది.
అమెరికన్ల పన్నులతో కొనసాగుతున్న అన్ని ప్రాజెక్టులను సమీక్షించడానికి 90 రోజులపాటు ఆర్థిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. హైదరాబాద్‌తోపాటు మహారాష్ట్రలోని కళ్యాణ్, పుణెలో ట్రాన్స్జెండర్ల క్లినిక్‌లు(మిత్ క్లినిక్‌లు) పని చేస్తున్నాయి. కాగా, ఈ క్లినిక్‌ల నిర్వహణ కోసం నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ వనరుల కోసం నిర్వాహకులు అన్వేషిస్తున్నారు.
ఈ క్లినిక్‌ల ద్వారా ట్రాన్స్జెండర్లకు మార్గదర్శనాన్ని హర్మోన్ థెరపీపై వైద్య సహాయం, మానసిక ఆరోగ్యం కోసం కౌన్సెలింగ్, హెచ్ఐవీ, ఇతర లైంగిక సంక్రమిత వ్యాధులపై అవగాహన, సాధారణ వైద్య సంరక్షణ వంటివి అందచేస్తున్నట్టు మిత్ర క్లినిక్‌లకు చెందిన వెబ్సైట్ పేర్కొంది.
ఎనిమిది మంది సిబ్బంది పనిచేసే ఒక్కో క్లినిక్ నిర్వహణకు ఏడాదికి కనీసం రూ. 30 లక్షల వరకు అవసరమవుతుంది. అయితే హెచ్ఐవీ(ఎయిడ్స్) సోకిన రోగులకు ఇచ్చే ప్రాణరక్షక మందులు, చికిత్సను కొనసాగించేందుకు యూఎస్ ఎయిడ్ నుంచి మినహాయింపు లభించింది. ఈ క్లినిక్‌లకు చెందిన రోగులలో 10 శాతం మంది మాత్రమే హెచ్ఐవీ బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.