(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): భారత అంతరిక్ష రంగంలో హైదరాబాదీ కంపెనీ కొత్త చరిత్ర సృష్టించనున్నది. ఓ ప్రైవేట్ కంపెనీ తయారు చేసిన రాకెట్ తొలిసారిగా నింగిలోకి వెళ్లనున్నది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ ఈ మైలురాయిని సాధించనున్నది. తద్వారా భారత రోదసి రంగంలోకి ప్రవేశించిన తొలి ప్రైవేటు కంపెనీగా ‘స్కైరూట్’ రికార్డులకెక్కనున్నది.
శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లో (షార్) ఇస్రో ఫస్ట్ లాంచ్ ప్యాడ్‌లో విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ దీన్ని రూపొందించింది. ఆర్బిటాల్ క్లాస్ క్యాటగిరీకి చెందిన ఈ రాకెట్‌కు ‘ మిషన్ ఆగమన్’ అని పేరు పెట్టారు. జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్య ఎప్పుడైనా ఈ రాకెట్ ప్రయోగం ఉండొచ్చని స్కైరూట్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దేశంలో ప్రైవేట్ రంగానికి చెందిన ఒక ఆర్బిటాల్ రాకెట్‌ను ప్రయోగించటం ఇదే మొదటిసారని, భారత రోదసి చరిత్రలో ఇదో సరికొత్త విప్లవంగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు.
ఏడంతస్తుల ఎత్తు ఉండే విక్రమ్-1ను మల్టీస్టేజ్ లాంచ్ వెహికిల్‌గా రూపొందించారు. 450 కిలోమీటర్ల ఎత్తులో భూ దిగువ కక్ష్యలోకి ఉపగ్రహాలను ఇది ప్రవేశపెడుతుంది. సుమారు 350 కిలోల పేలోడ్‌ను (ఉపగ్రహాలను) ఈ రాకెట్ మోసుకెళ్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
రోదసి రంగంలో చిన్న ఉపగ్రహాలకు విపరీతమైన డిమాండ్ ఉన్నది. అయితే, వీటిని కక్ష్యలోకి చేర్చడానికి ప్రభుత్వ రంగ అంతరిక్ష సంస్థలపై ఆధారపడాల్సి వస్తున్నది. అయితే, తక్కువ ఖర్చుతో చిన్న ఉపగ్రహాలను భూమికి సమీప కక్ష్యలోకి తీసుకువెళ్లడానికి విక్రమ్-1 రాకెట్‌ను రూపొందించినట్టు స్కైరూట్ ప్రతినిధులు తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టీ-హబ్, టీ-వర్క్స్‌లోనే ‘స్కైరూట్ ఏరోస్పేస్’ సంస్థ పురుడుపోసుకొన్నది. 2018లో అప్పటి ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో ఈ కంపెనీ ఏర్పాటయ్యింది. 2022లో విక్రమ్-ఎస్ పేరిట రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా ప్రయోగించి రికార్డు సృష్టించిన స్కైరూట్.. ఇప్పుడు తొలి ప్రైవేట్ రాకెట్‌ను నింగిలోకి పంపనున్నది. కేసీఆర్ ప్రభుత్వం అండతోనే విక్రమ్-ఎస్ ప్రయోగం సాకారమయ్యిందని 2022లో ఓ ఇంటర్వ్యూలో స్కైరూట్ సహ వ్యవస్థాపకులు పవన్‌కుమార్ తెలిపారు.
కంపెనీ: స్కైరూట్ ఏరోస్పేస్
స్థాపితం: జూన్ 12, 2018
ఇంక్యుబేషన్: టీ-హబ్ నిర్మాణ, సాంకేతిక
సహకారం: టీ-వర్క్స్
హెడ్‌క్వార్టర్స్: హైదరాబాద్
వ్యవస్థాపకులు: ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు
పవన్‌కుమార్, నాగభరత్
ఉత్పత్తులు: లాంచ్ వెహికిల్స్
సేవలు: రోదసిలోకి ఉపగ్రహాలను పంపించడం
ఉద్యోగులు: 1000+