భోపాల్, మే 11: భారతదేశపు మొట్టమొదటి కార్బన్-క్యాప్చరింగ్ ‘ఆల్గే ట్రీ’ భోపాల్‌లో ఏర్పాటైంది. ‘స్మార్ట్ సిటీ’ పథకం కింద నగరంలోని స్వామి వివేకానంద పార్క్‌లో దీనిని ఏర్పాటు చేశారు. 25 పూర్తిస్థాయి చెట్లకు సమానమైన కా ర్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తూ.. అదే స్థాయిలో ఆక్సిజన్‌ను తిరిగి వాతావరణంలోకి విడుదల చేయటం దీని ప్రత్యేకత. సౌరశక్తితో పనిచేస్తూ, పర్యావరణానికి హాని కలిగించకుండా కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది.
ఇది ఒక రకమైన కృత్రిమ పర్యావరణ పరికరం. ‘ఆల్గే’అంటే వాడుక భాషలో పాచి(శైవలాలు). వీటితో ఏర్పడిన ఒక చెట్టునే ‘ఆల్గే ట్రీ’గా పిలుస్తారు. భోపాల్‌లో దీని ఏర్పాటుకు సంబంధించి వీడియోలు ఆన్లైన్లో తెగ వైరల్ అయ్యాయి. నెటిజన్ల నుంచి స్పందన వ్యక్తమైంది. రెండు సంవత్సరాలపాటు 50మందికిపైగా పరిశోధకులు, సైం టిస్టులు, ఇంజనీర్లతో కలిసి మష్రూమ్ వ రల్డ్ గ్రూప్ ‘ఆల్గే ట్రీ’ పరికరాన్ని అభివృద్ధి చేసింది.