న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. భారతీయ ఉత్పత్తి రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. భారతీయ ఎరువుల రంగం(Fertiliser Production)పై యుద్ధ ప్రభావం మరీ అధికంగా ఉన్నది. కేంద్ర వాణిజ్య శాఖ రిలీజ్ చేసిన డేటా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో ఎరువుల ఉత్పత్తి సుమారు క్వార్టర్ వంతు పడిపోయినట్లు అధికారి డేటా పేర్కొన్నది. ఇండియాలో ఎరువుల ఉత్పత్తి మార్చిలో 24.6 శాతానికి పడిపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎరువుల తయారీలో సహజవాయువు చాలా కీలకమైంది. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో నేచురల్ గ్యాస్ దిగుమతి క్షీణించింది. ఎరువుల ఉత్పత్తికి కీలకమైన సహజవాయువు తగ్గడంతో.. గత ఏడాదితో పోలిస్తే మార్చి నెలలో ఎరువుల ఉత్పత్తి 24.6 శాతం తగ్గినట్లు తెలుస్తోంది.
నేచురల్ గ్యాస్ ద్వారా ఎక్కువగా యూరియాను ఉత్పత్తి చేస్తారు. భారతీయ ఎరువుల రంగంలో యూరియా చాలా ప్రాధానమైంది. విస్తృతమైన భారతీయ వ్యవసాయ రంగంలో యూరియాను ఎక్కువగా వినియోగిస్తుంటారు. హోర్ముజ్ జలసంధి మూసివేయడం వల్ల ఆ మార్గం ద్వారా రావాల్సిన సహజ ఇంధన సరఫరాలు పడిపోయాయి. దీని వల్ల ఎరువుల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఫెర్టిలైజర్ ఉత్పత్తికి సంబంధించిన ఇన్పుట్స్ అన్నీ హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారానే ఇండియాకు వస్తుంటాయి. అయితే అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేయడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి.
ప్రపంచానికి అవసరమైన ఎరువుల్లో మూడో వంతు హోర్ముజ్ జలసంధి మార్గంలోనే వెళ్తుంటాయి. ఎరువులకు చెందిన ముడిసరుకుల సరఫరా దెబ్బతినడంతో.. దాని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తిలో కూడా అసమతుల్యత రానున్నది. 140 కోట్ల భారతీయ జనాభాకు వ్యవసాయమే ముఖ్యమైంది. సుమారు 45 శాతం దేశ ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడుతారు. ఇక ఆహార ధాన్యాల ఉత్పత్తిలో యూరియాను అధికంగా వాడుతున్నారు. ప్రస్తుతం ఇరాన్ వార్‌లో యూరియా ఉత్పత్తి పడిపోవడం, ఫలితంగా ఎరువుల ఉత్పత్తి తగ్గడం.. ఆ ప్రభావం భారతీయ వ్యవసాయ రంగాన్ని క్షీణింపచేసే అవకాశాలు ఉన్నాయి. ఫెర్టిలైజర్ల ఉత్పత్తి 24.6 శాతం పడిపోయినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించడం ఆందోళనకర అంశమే.