(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఎంతోకాలంగా వాయిదాపడుతూ వస్తున్న జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది. జనగణనతో పాటే ఈసారి కులగణనను కూడా చేపట్టనున్నారు. రెండు దశల్లో ఈ ప్రక్రియ జరుగనున్నది. తొలి దశలో భాగంగా హిమాలయ ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో 2026, అక్టోబర్ 1 నుంచి జనగణనతో పాటు కులగణనను చేపట్టనున్నారు. రెండో దశలో భాగంగా 2027, మార్చి 1 నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జన-కులగణనను చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జూన్ 16వ తేదీన విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. సెక్షన్ 3, జనగణన చట్టం, 1948 ప్రకారం జన-కులగణనను చేపట్టనున్నట్టు కేంద్రం వివరించింది.
16 ఏండ్ల తర్వాత..
దేశంలో జనగణనను పదేండ్లకోసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2011లో ఈ ప్రక్రియను చేపట్టారు. రెండు విడుతల్లో ఈ ప్రక్రియ జరిగింది. వాస్తవానికి 2021లో జన గణనను నిర్వహించాలి. అయితే, కొవిడ్ కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. అయితే, ఇప్పుడు 16 ఏండ్ల తర్వాత తొలిసారిగా జనాభా గణనను నిర్వహించనున్నారు. దీంతోపాటు తొలిసారిగా కులగణనను కూడా చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటే కులగణనను కూడా చేపట్టనున్నట్టు గత నెలలో కేంద్రం వెల్లడించడం తెలిసిందే. కాగా జనాభా లెక్కల వివరాల నమోదుకు సంబంధించి ఇప్పటికే 30కి పైగా ప్రశ్నలను సిద్ధం చేసినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
వ్యయం ఎంతంటే?
2021లో జనగణన కోసం ప్రభుత్వం రూ. 8,754.23 కోట్లను కేటాయించింది. ఎన్పీఆర్ (నేషనల్ పాపులేషన్ రిజిష్టర్) అప్డేటింగ్ కోసం మరో రూ. 3,941.35 కోట్లను పక్కనబెట్టింది. అంటే మొత్తంగా రూ. 12,695.58 కోట్లను కేటాయించింది. అయితే, ఈ నాలుగేండ్లలో జనాభా పెరుగడంతో ప్రస్తుతం జనగణనకు రూ. 13 వేల కోట్ల వరకూ వ్యయం అయ్యే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, 2025-26లో జనగణన కోసం బడ్జెట్లో రూ. 574.80 కోట్ల నిధులను మాత్రమే కేంద్రం కేటాయించింది. దీంతో పలువురు జనగణన నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, జనగణనకు బడ్జెట్ కేటాయింపుల్లో సవరణలు చేయవచ్చని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి.
ఆందోళనలో దక్షిణాది రాష్ర్టాలు
కేంద్రం చేపట్టబోయే జనగణనను బట్టే ‘పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విధానం’ (డీలిమిటేషన్) ప్రక్రియ ఉండనున్నట్టు హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతున్నది. తాజా జనాభాను బట్టి లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను చేపడితే దక్షిణాది రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం జరుగనున్నట్టు మేధావులు చెప్తున్నారు. జనాభా నియంత్రణలో గత కొన్నేండ్లుగా క్రమశిక్షణతో ముందుకు సాగుతున్న దక్షిణాది రాష్ర్టాలకు ఇప్పుడు ఆ క్రమశిక్షణే పెద్ద ‘రాజకీయ శిక్ష’గా మారనున్నట్టు పేర్కొంటున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను గుర్తించడానికి పదేండ్లకోసారి జన గణన ప్రాతిపదికగా డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుత లోక్‌సభలోని 543 నియోజకవర్గాలను 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ధారించారు.
అనంతరం జనాభా నియంత్రణ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో దక్షిణాది రాష్ర్టాలు జనాభా నియంత్రణ పాటించగా, ఉత్తరాదిలో జనాభా విస్ఫోటం సంభవించింది. దీంతో ఉత్తరాదిలోనూ జనాభా నియంత్రణ పద్ధతులు పాటించి జనాభా సమతుల్యత తీసుకురావాలని ప్రయత్నించారు. ఇందులో భాగంగానే, డీలిమిటేషన్ చట్టం-2002 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనను 2026 దాకా నిలిపేశారు. కానీ ఉత్తరాదిన జనాభా నియంత్రణ లక్ష్యం నెరవేరలేదు. ఇదే సమయంలో గడువు కూడా దగ్గరికి వస్తున్నది. దీంతో జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాలను సవరించాలని యోచిస్తున్నారు. ఇదే జరిగితే, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ర్టాలు పార్లమెంట్లో తమ ప్రాతినిధ్యాన్ని తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నట్టు రాజకీయ నిపుణులు చెప్తున్నారు.