న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: అక్రమ వలసదారుల పట్ల ట్రంప్ ప్రభుత్వం ఓవైపు కర్కశంగా వ్యవహరిస్తున్నా.. అమెరికా వెళ్లాలన్న భారతీయుల యావ ఏమాత్రం తగ్గడం లేదని ఓ వార్తా కథనం పేర్కొంది. ముఖ్యంగా పంజాబ్, హర్యానాకు చెందిన యువత దొడ్డిదారిన అమెరికా వెళ్లేందుకు మార్గం చూపాలంటూ ట్రావెల్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారని తెలిపింది.
అక్రమ మార్గంలో అమెరికా వెళ్లాలనుకుంటున్న వారిని కొన్ని ఏజెన్సీలు ముందుగా ఆఫ్రికన్ దేశాలకు, ఆ తరువాత దక్షిణ అమెరికా దేశాలకు పంపించి, అక్కడి నుంచి మెక్సికోకు రవాణా చేసి సరిహద్దు గుండా అమెరికాలోకి అక్రమంగా పంపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ మార్గం ఎంతో ప్రమాదకరమైనప్పటికీ భారతీయులు వెనుకంజ వేయడం లేదని ఆ కథనం వివరించింది. అమెరికాలో ప్రవేశించేందుకు మరో మార్గం బహమాస్. ఇది దాదాపు 27 గంటల ప్రయాణమని ఓ ఏజెంట్ వివరించారు. ఢిల్లీ నుంచి బహమాస్ చేరేందుకు మధ్యలో అనేక చోట్ల ప్రయాణ సాధానాలను మారాల్సి ఉంటుంది. ఆ తరువాత రెండు సముద్ర మార్గాలు.. ఒకటి మయామీ ద్వారా, రెండో పోర్ట్ ఆఫ్ హూస్టన్ ద్వారా అమెరికా భూభాగంలోకి పంపుతారు. సముద్ర మార్గం అత్యంత ప్రమాదకరమని ఆ ఏజెంట్ పేర్కొన్నారు. చిన్న చిన్న పడవల్లో వాటి సామర్థ్యానికి మించి జనాన్ని ఎక్కించి పంపుతుంటారని, అవి బోల్తాకొట్టడమో, మునిగిపోవడమో జరుగుతుంటుందని అన్నారు. గత ఐదారేండ్లలో అమెరికా, కెనడా సరిహద్దు నుంచి కూడా దొంగదారిలో పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.