ఉపగ్రహ వ్యర్థాలతో అంతరిక్షం చెత్తకుప్పలా మారుతున్నది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్), ఇతర ఉపగ్రహాలకు ఈ రోదసి వ్యర్థాలు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. వారం వ్యవధిలోనే (నవంబర్ 19, నవంబర్ 25) ఐఎస్ఎస్కు రెండు సార్లు వీటి నుంచి ప్రమాదం తప్పిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
-నేషనల్ డెస్క్
Space Debris | ప్రస్తుతం భూ దిగువ కక్ష్యలో 10 వేలకు పైగా క్రియాశీల ఉపగ్రహాలు ఉన్నాయి. 2030 నాటికి వీటి సంఖ్య లక్షకు చేరవచ్చని అంచనా. దీంతో అంతరిక్షంలోనూ ట్రాఫిక్ జామ్ తలెత్తే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కాలం చెల్లిన శాటిలైట్లు, రాకెట్ల విడిభాగాలు, స్పేష్క్రాఫ్ట్ల శిథిలాలతో భూ దిగువ కక్ష్య ‘కాస్మిక్ స్క్రాప్యార్డ్’గా మారింది. ఈ అంతరిక్ష వ్యర్థాలు గంటకు సుమారు 18,000 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదకరంగా మారాయి. ఈ వేగం బుల్లెట్ స్పీడ్ కంటే ఏడు రెట్లు ఎక్కువ. దీంతో ఈ వ్యర్థాలు భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు, శాటిలైట్లకు ప్రమాదకరంగా మారాయి. సూర్యుని నుంచి వెలువడే అతి నీలలోహిత కిరణాలను 99 శాతం వరకు ఓజోన్ పొర అడ్డుకుంటుంది. మానవులు ప్రయోగిస్తున్న ఉపగ్రహాల వల్ల వచ్చే కాలుష్యం ఈ ఓజోన్ పొరను దెబ్బతీస్తుంది.
2007లో తాను ప్రయోగించిన ఫెన్‌గ్యూన్-1ను చైనా నాశనం చేయడంతో అంతరిక్షంలో వ్యర్థాలు భారీగా పెరిగాయి. 2009లో రష్యాకు చెందిన అనియంత్రిత శాటిలైట్ (కాస్మోస్-2251), అమెరికాకు చెందిన ఇరిడియం 33 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను ఢీకొనడంతో ఈ వ్యర్థాలు మరింత పెరిగాయి.
అంతరిక్ష వ్యర్థాల నిర్వహణపై ఎటువంటి నిబంధనలు లేనందువల్ల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. భూ దిగువ కక్ష్య ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద చెత్త డంప్యార్డుగా మారిందని నాసా అధికారిక వెబ్సైట్ పేర్కొంది. అలాంటపుడు దీనిని ఎందుకు తొలగించడం లేదు? అనే ప్రశ్న ఎదురవుతుంది. దానికి సమాధానం ఒకటే. అంతరిక్ష యానం చాలా ఖరీదైనది, చెల్లాచెదురుగా పడిన చెత్తను ఏరడం అంత సులువు కాదు.
అమెరికా- 40%
రష్యా- 28%
చైనా- 19%
భారత్-0.8%