న్యూఢిల్లీ : వేపుళ్ల వంటివాటి కోసం ఒకసారి ఉపయోగించిన వంట నూనెను పారబోసేస్తూ ఉంటారు. ఇటువంటి నూనెతో సుస్థిర వైమానిక ఇంధనం (సుస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్)ను తయారు చేయడానికి ఇండియన్ ఆయిల్ రిఫైనరీకి సర్టిఫికేషన్ లభించింది. హర్యానాలోని పానిపట్ రిఫైనరీకి ఈ సర్టిఫికేషన్ లభించినట్లు ఈ కంపెనీ చైర్మన్ అరవిందర్ సింగ్ సాహ్నీ తెలిపారు.
మన దేశంలో ఈ సర్టిఫికేషన్‌ను పొందిన ఏకైక కంపెనీ తమదేనన్నారు. పెట్రోలియమేతర పదార్థాల నుంచి తయారు చేసే ప్రత్యామ్నాయ ఇంధనమే ఎస్ఏఎఫ్. ఈ ఇంధనాన్ని వాడటం వల్ల గగనతల రవాణా నుంచి ఉద్గారాలు తగ్గుతాయి. సంప్రదాయ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్ లేదా జెట్ ఫ్యూయల్)లో 50 శాతం వరకు ఈ ఎస్ఏఎఫ్ను కలపవచ్చు.