న్యూఢిల్లీ: భారతీయ మహిళా ప్రొఫెషనల్స్ ఇతర దేశాల మహిళల కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం, ఆశావాదం గలవారని జాబ్ లిస్టింగ్స్ సైట్ ‘ఇండీడ్’ అధ్యయనం వెల్లడించింది. జీతం పెంచాలని కోరడంలో భారతీయ మహిళలు ప్రథమ స్థానంలో నిలిచారు. భారతీయ మహిళల్లో 65% మంది తమకు జీతాలు పెంచాలని కోరారు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న అమెరికాలో 51% మంది మహిళలు జీతాల పెంపును కోరారు. ఫ్రాన్స్, జర్మనీలలో 50% మంది, కెనడాలో 47% మంది, బ్రిటన్లో 45% మంది మహిళా ప్రొఫెషనల్స్ జీతాలు పెంచాలని గతంలో యాజమాన్యాలను కోరారు. ఇండీడ్ ఇండియా డైరెక్టర్ నిశిత లాల్వానీ మాట్లాడుతూ వేతనాల వ్యత్యాసాలను తగ్గించడానికి యాజమాన్యాలు చేపడుతున్న చర్యలపై భారతీయ మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.