న్యూఢిల్లీ : హెచ్-1బీ వీసా ఫీజును 1 లక్ష డాలర్లకు (దాదాపు రూ. 85 లక్షలు) పెంచుతూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న చర్యతో ఇప్పటికే తల్లడిల్లుతున్న భారతీయ వృత్తి నిపుణులకు మరో ఎదురుదెబ్బ పొంచి ఉంది. ఔట్సోర్సింగ్ని లక్ష్యంగా చేసుకుని కొత్త చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్న అమెరికా ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే భారతీయ వృత్తి నిపుణులతోపాటు భారతీయ ఐటీ దిగ్గజ కంపెనీలు సైతం భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. హాల్టింగ్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్(హైర్) చట్టం, 2025 పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నది. అమెరికా కంపెనీలు తమ పనిని విదేశాల్లో ఔట్సోర్సింగ్ ఇవ్వడాన్ని నిరుత్సాహపరచడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం.
ఇందులో భాగంగా అమెరికాలో అందించే సేవల కోసం విధులు నిర్వహించే విదేశాల్లోని ఉద్యోగుల జీతభత్యాలపై 25 శాతం పన్ను విధించాలని చట్టంలో ప్రతిపాదించారు. ఇది చట్ట రూపం దాలిస్తే భారతీయ వృత్తి నిపుణులకు ఇక పూర్తిగా డిమాండు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ చర్య తన ఆదాయంలో సగానికి పైగా అమెరికా నుంచి పొందుతున్న భారతీయ ఐటీ, సేవల వ్యవస్థను బలంగా దెబ్బతీస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ హెచ్చరించారు. వస్తువుల నుంచి సేవలకు భారీ సుంకాలు ఇక విస్తరించనున్నాయని ఓ ఇంటర్వ్యూలో రఘురామ్ రాజన్ తెలిపారు. హైర్ చట్టం వల్ల ఔట్సోర్సింగ్ ద్వారా తీసుకున్న పనిపై నేరుగా పన్ను పడుతుందని, సేవల ఎగుమతుల మీద అధికంగా ఆధారపడిన భారత్ వంటి దేశాలపై దీని ప్రభావం విస్తృతంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఎక్స్ వేదికగా జైరాం రమేశ్ స్పందిస్తూ వైట్ కాలర్ ఉద్యోగాలు భారత్కు కోల్పోకూడదన్న భావన అమెరికాలో పెరుగుతోందనడానికి హైర్ చట్టమే నిదర్శనమని అన్నారు.
2015 అక్టోబర్ 6న హైర్ చట్టాన్ని అమెరికా సెనేట్లో ఓహియో సెనేటర్ బెర్నీ మొరేనో ప్రవేశపెట్టారు. దీన్ని ఆర్థిక వ్యవహారాలకు చెందిన సెనేట్ కమిటీకి సెనేట్ నివేదించింది. ఈ చట్టం ఆమోదం పొందితే అమెరికా లోపల వాడుకునే విదేశీ ఉద్యోగుల సేవలకు చేసే చెల్లింపులపై అమెరికా కంపెనీలు 25 శాతం పన్ను చెల్లించాలన్నది ఈ చట్టం నిర్దేశిస్తోంది. అంతేగాక అటువంటి చెల్లింపులను పన్ను మినహాయింపు వ్యయాలుగా కంపెనీలు చూపించుకోవడాన్ని కూడా ఈ చట్టం నిరోధిస్తుంది. పన్నుల ద్వారా కంపెనీల నుంచి వచ్చే ఆదాయం.. అమెరికన్ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి అప్రెంటిస్షిప్లను ప్రోత్సహించే దేశీయ శ్రామికశక్తి నిధికి చేరుతుంది. కాగా, భారత్కు చెందిన దిగ్గజ ఐటీ సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో తదితర కంపెనీల ప్రధాన ఆదాయ వనరుగా అమెరికా ప్రస్తుతం కొనసాగుతోంది. హైర్ చట్టం ఆమోదం పొందితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డాటా మేనేజ్మెంట్, కస్టమర్ సపోర్ట్ కోసం అమెరికన్ క్లయింట్లపై పూర్తిగా ఆధారపడిన ఈ కంపెనీలకు కొత్త కాంట్రాక్టులు తగ్గిపోయి లాభాలపై కోత పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే హెచ్-1బీ వీసా ఫీజు పెంపుతో వృత్తి నిపుణుల వలసలకు భారీగా గండిపడింది. హైర్ చట్టం అమలులోకి వస్తే అమెరికన్ కంపెనీలు 25 శాతం ఔట్సోర్సింగ్ పన్నును ఎదుర్కోవలసి వస్తుంది. దీని వల్ల భారత్కు ఇచ్చే ఔట్సోర్సింగ్ నిలిచిపోయే అవకాశం ఉంది. భారత్లో ఉండి అమెరికన్ కంపెనీలకు సేవలందచేస్తున్న టెకీలకు ఇక ఉద్యోగావకాశాలు తగ్గిపోవడమే కాక కాంట్రాక్టులపై కూడా వేటు పడే అవకాశం ఉంది.