హైదరాబాద్, జూన్ 6 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): విద్యార్థి వీసాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న కఠిన నిర్ణయాలు భారతీయ విద్యార్థుల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదాన్ని చూపిస్తూ విదేశీయులపై ఆయన విధిస్తున్న ఆంక్షలు ఇండియన్ స్టూడెంట్స్ ‘డాలర్ డ్రీమ్స్’ను కల్లలుగా మారుస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త నిబంధనలతో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
ఆంక్షల నడుమ తమ బిడ్డలను అమెరికాకు పంపించి డబ్బును పోగొట్టుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నారు. ఉన్నత విద్య కోసమని రిస్క్ చేసి అమెరికాకు పంపించడం కంటే యూకే, జర్మనీ తదితర దేశాలకు పంపించడం మంచిదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు వెళ్లే విద్యార్థుల ఎన్రోల్మెంట్లు అంతకంతకూ తగ్గుతున్నట్టు పలు కన్సల్టెన్సీలు చెప్తున్నాయి.
జనవరి 20న అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టింది మొదలు స్టూడెంట్ వీసాలపై ట్రంప్ పలు కఠిన ఆంక్షలను విధిస్తూనే ఉన్నారు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) కింద అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కారు ఇప్పటికే షాక్ ఇచ్చింది. స్టూడెంట్ అండ్ ఎక్సేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో (ఎస్ఈవీఐఎస్) 15 రోజుల్లోగా ఉద్యోగ వివరాలను అప్డేట్ చేయాలని సూచించింది. లేదంటే స్వదేశానికి పంపించివేస్తామని హెచ్చరించింది. ఇక, ఏదో ఒక వంకతో విదేశీయులను వెనక్కి పంపించేందుకు ట్రంప్ సర్కారు వింత రూల్స్‌ను తీసుకొచ్చింది.
విద్యార్థి లేదా వర్క్ వీసాపై ఉన్నవారు డ్రంకెన్ డ్రైవింగ్‌లో దొరికితే వారి వీసాను రద్దు చేస్తున్నారు. ఇక, హమాస్, ఇతర ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా ఎవరైనా సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తే వారి ఎఫ్1, ఎం1, జే1 వీసాలను రద్దు చేశారు. దీనికోసం ఏఐతో నిఘాను పెట్టారు. అమెరికాలోని విద్యాసంస్థల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులు కాలేజీ మానేసినా, విద్యా సంస్థకు చెప్పకుండా స్టడీ ప్రొగ్రామ్‌కు వెళ్లినా.. అదేపనిగా క్లాసులకు ఎగ్గొడుతూ హాజరుశాతం తక్కువగా ఉన్నా వారి వీసాలను రద్దు చేస్తామని ట్రంప్ సర్కారు ప్రకటించింది. ఇలా సవాలక్ష ఆంక్షలతో విదేశీ విద్యార్థులకు వీసాలను నిరాకరించడమే లక్ష్యంగా ట్రంప్ యంత్రాంగం ముందుకు వెళ్తున్నది.
గడిచిన ఏడాదికి తమ కన్సల్టెన్సీ నుంచి 100 మంది విద్యార్థులు అమెరికాకు వెళ్తే, ఈసారి అది 10 కూడా దాటట్లేదని అహ్మదాబాద్‌లోని సుభాష్ దేవత్వాల్ అనే కన్సల్టెన్సీ యజమాని వాపోయారు.
విదేశీ విద్యార్థులకు అమెరికా వీసాల జారీ కోసం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనుసరిస్తున్న విధానాలు భారత విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అమెరికాలో ప్రవేశించాలనుకునేవారి అర్హతను నిర్ధారించేందుకు వారి ఫేస్బుక్, ఎక్స్, లింక్డ్ఇన్, టిక్‌టాక్ వంటి సామాజిక మాధ్యమాల ఖాతాలను తనిఖీ చేయడాన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. దీంతో భారత విద్యార్థులు తమ పోస్టులు, ఖాతాలను డిలీట్ చేస్తున్నారు. తాము పోస్ట్ చేసిన పొలిటికల్ జోక్స్, వ్యూస్, యాక్టివిజం తమ వీసా దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూల సమయంలో తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తాయేమోనని ఆందోళనకు గురవుతున్నారు.