Strait Of Hormuz : ఇరాన్–అమెరికా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధిని మూసేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇండియా సహా అనేక దేశాలకు చెందిన నౌకలు ఈ జలసంధి వద్దే చిక్కుకుపోయాయి. ఈ నేపథ్యంలో జలసంధిలో చిక్కుకుపోయిన భారత నౌకలపై కేంద్ర విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ దీనిపై ప్రకటన చేశారు.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 11 భారత నౌకలు జలసంధిని దాటాయని ఆయన వెల్లడించారు. ఇంకా 13 నౌకలు పర్షియన్ గల్ఫ్ వద్ద చిక్కుకుపోయినట్లు తెలిపారు. మిగిలన నౌకలు తిరిగి ఇండియా సురక్షితంగా చేరేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు జైశ్వాల్ చెప్పారు. ఈ విషయంలో ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఇరాన్‌తో చర్చలు, సంప్రదింపుల తర్వాత ఇండియా ఈ అంశంలో ముందడుగు స్థితిలోనే ఉందన్నారు. 11 నౌకలు హార్ముజ్ నుంచి సురక్షితంగా ఇండియా చేరాయన్నారు. మిగిలిన నౌకల్ని కూడా ఇండియా రప్పించేందుకు ఇరాన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
అంతర్జాతీయ చమురు రవాణాకు సంబంధించి హార్ముజ్ జలసంధి అత్యంత కీలకం అనే సంగతి తెలిసిందే. హార్ముజ్ మూసివేయడంతో అనేక దేశాలు చమురు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ఇండియా సహా అనేక దేశాలు ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం అనేక దేశాలకు చెందిన నౌకలు ఇంకా అక్కడే చిక్కుకుపోయాయి.