న్యూఢిల్లీ: రైలు టికెట్ చార్జీలు స్వల్పంగా పెరిగాయి. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ తరగతి టికెట్ చార్జీలను కిలోమీటరుకు 1 పైసా వంతున, అన్ని ఏసీ తరగతుల టికెట్ చార్జీలను కిలోమీటరుకు 2 పైసల వంతున రైల్వే శాఖ పెంచింది. జూలై 1వ తేదీ నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నట్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిపాదిత చార్జీల పెంపుపై రైల్వే శాఖ అధికారులు జూన్ 24న సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే, రైళ్లు, తరగతి క్యాటగిరీల చార్జీల పట్టికని సోమవారం అధికారికంగా రైల్వే శాఖ ప్రకటించింది. రోజువారీ ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సబర్బన్ రైళ్ల చార్జీలు, నెలవారీ సీజన్ టికెట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. సాధారణ రెండవ తరగతి చార్జీలను 500 కిలోమీటర్ల దూరం వరకు పెంచలేదు.
ఆపైన ప్రతి కిలోమీటరుకు అర్ధపైసా వంతున పెంచారు. సాధారణ స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు కిలోమీటరుకు అర్ధపైసా చొప్పున జూలై 1 నుంచి అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. చార్జీల పెంపుదల రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజస్, హమ్‌సఫర్, అమృత్ భారత్, మహామాన, గతిమాన్, అంత్యోదయ, జన శతాబ్ది, యువ ఎక్స్‌ప్రెస్, ఏసీ విస్టాడోమ్ కోచ్‌లు, అనుభూతి కోచ్‌లు, సాధారణ నాన్-సబర్బన్ సర్వీసులకు క్లాసుల వారీగా వర్తిస్తుంది. జూలై 1 కన్నా ముందు జారీ అయిన టికెట్లు పాత చార్జీలతోనే చెల్లుబాటు అవుతాయి. రిజర్వేషన్ చార్జీలు, సూపర్‌ఫాస్ట్ సర్‌చార్జీలు, ఇతర చార్జీలలో ఎటువంటి మార్పులు లేవని రైల్వే శాఖ తెలిపింది. నిబంధనల ప్రకారం జీఎస్టీ ఉంటుందని రైల్వే శాఖ పేర్కొంది. మరోవైపు తత్కాల్ టికెట్ బుకింగ్‌కు ఆధార్ వివరాల నమోదును తప్పనిసరి చేసింది.