Train fares : రైలు టికెట్ (Train ticket) ధరలు స్వల్పంగా పెరుగనున్నట్లు రైల్వే శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జూలై 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. నాన్ ఏసీ మెయిల్/ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ టికెట్ ధర కిలోమీటర్‌కు 1 పైసా, ఏసీ తరగతి టికెట్ ధర కిలోమీటర్‌కు 2 పైసల చొప్పున పెరగనున్నాయి. ఈ మేరకు రైల్వే వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్లమీడియా వెబ్సైట్లలో వార్తలు వస్తున్నాయి.
అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చాలా ఏళ్ల తర్వాత రైల్వే టికెట్ ధరలు సవరిస్తుండటం గమనార్హం. సబర్బన్ టికెట్ ధరలకు, 500 కిలోమీటర్ల వరకు సెకండ్ క్లాస్ ప్రయాణానికి ఈ పెంపు వర్తించదని తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 500 కిలోమీటర్లు దాటితే కిలోమీటర్‌కు ఒక పైసా చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
తత్కాల్ టికెట్‌కు సంబంధించి రైల్వే శాఖ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ అథంటికేషన్ ఉన్న వారికి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. జూలై 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. అదేరోజు నుంచి టికెట్ ధరల పెంపు కూడా అమల్లోకి రానున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. నెలవారీ సీజన్ టికెట్ ధరల్లో కూడా ఎలాంటి మార్పు ఉండబోదని సంబంధిత వర్గాలు చెప్పాయి.